ఆల్కహాల్​ ఫ్యాక్టరీ వేస్టేజీతో కలుషితమవుతున్న గోదావరి జలాలు

ఆల్కహాల్​ ఫ్యాక్టరీ వేస్టేజీతో కలుషితమవుతున్న గోదావరి జలాలు

నిజామాబాద్, వెలుగుఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కలుషితమవుతోంది. ఎస్సారెస్పీ జలాల్లోకి  మహారాష్ట్ర ధర్మాబాద్ శివారులోని ఆల్కహాల్ ఫ్యాక్టరీ వ్యర్థాలను వదులుతోంది. దీంతో ఆ నీటిని పంటలకు, తాగునీటి అవసరాలకు వాడుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. ధర్మాబాద్ శివారులో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఆల్కహాల్ ఫ్యాక్టరీ ఉంది. ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే రసాయనాల వ్యర్థాల నిల్వకు ఫ్యాక్టరీ ఆవరణలో చెరువులాంటి ట్యాంకును నిర్మించారు. గోదావరిలో వరద లేనన్ని రోజులు ఫ్యాక్టరీ ఆవరణలోని ట్యాంకులోకే వ్యర్థ జలాలను వదులుతున్నారు. వర్షాకాలం గోదావరిలో వరద ప్రవాహం పెరగగానే సందట్లో సడేమియా అన్న చందంగా ట్యాంకులో నిండిన వ్యర్థ జలాలను గోదావరిలోకి వదులుతున్నారు. వ్యర్థాలతో  ఎస్సారెస్పీ నీరు రంగుమారి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎస్సారెస్సీలోకి వరద ప్రవాహం పెరిగి వాటర్ లెవెల్ 57 టీఎంసీలకు పైగా చేరుకుంది. ఆల్కహాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం  ఇదే అదనుగా వ్యర్థ జలాలు నదిలోకి వదులుతోంది.

సాగు, తాగు నీటికి…

ఎస్సారెస్పీ నీటిని ఇటు వ్యవసాయానికి, అటు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఎస్సారెస్పీ పరిధిలో వివిధ ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి ద్వారా పంట పొలాలకు సాగునీరు సరఫరా అవుతోంది.  లక్ష్మి కెనాల్ ద్వారా నిజామాబాద్ జిల్లా పరిధిలోని 25,677 ఎకరాలు,  కాకతీయ కాలువ ద్వారా 9,847 ఎకరాలు, సరస్వతి కెనాల్ ద్వారా 35,825 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పరిధిలో రెండు లక్షల ఎకరాలు సాగవుతోంది. మిషన్‌‌ భగీరథ ద్వారా  జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు పట్టణాలకు, గ్రామాలకు ఎస్సారెస్పీ నుంచే తాగునీటి సరఫరా జరుగుతోంది. నీరు కలుషితమైతే ఇటు పంటలతోపాటు ప్రజారోగ్యానికి సైతం ముప్పు వాటిల్లుతుంది. ఎస్సారెస్పీలో లక్షల సంఖ్యలో పెంచుతున్న చేప పిల్లల సైతం ప్రభావం పడుతుందని మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం
చేస్తున్నాయి.

మహారాష్ట్రకు లెటర్ రాశాం

మహారాష్ట్ర ప్రాంతంలోని ధర్మాబాద్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ జలాలను ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో గోదావరిలో వదిలేస్తున్నారు. దీంతో నీరు కలుషితమై రంగు మారుతోంది.  దీనిపై మహారాష్ట్ర పొల్యూషన్ శాఖకు లేఖ రాశాం. చర్యలు తీసుకోవాలని కోరాం.
– జగదీష్, ఎస్సారెస్పీ డిప్యూటీ ఈఈ

పంటలకు దెబ్బ

మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే రసాయనాల వల్ల ఎస్సారెస్పీ నీరు కలుషితం అవుతోంది. ఆ నీటిని సాగుకు వాడితే పంటలు దెబ్బతినే అవకాశాలున్నాయి. ఆ రసాయనాల ప్రభావం వల్ల  భూమి సారం కోల్పోతుంది. కలుషిత నీటితో చేప పిల్లలు చనిపోతున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

– బుల్లెట్ రామ్ రెడ్డి, ఆయకట్టు రైతు

జీవనోపాధి దెబ్బతింటుంది

గత సంవత్సరం ఎస్సారెస్పీలో  చేపలు అనారోగ్యం బారినపడి వేల సంఖ్యలో చనిపోయాయి. ఈ కలుషిత నీటి వల్ల చేపలు చనిపోతే మా జీవనోపాధి దెబ్బతింటుంది. కలుషిత నీటిపై అధికారులు చర్యలు చేపట్టాలి.

– తోకల నారాయణ,
గంగపుత్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు