ఫొటో ఓటరు తుది జాబితా విడుదల

ఫొటో ఓటరు తుది జాబితా విడుదల

 

  •     గ్రామ పంచాయతీల్లో ప్రదర్శన
  •     ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలకు షెడ్యూల్​ 
  •     ఈ నెల 10 వరకు పూర్తిచేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా.. ఎన్నికలు నిర్వహించేలా సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీల్లో  ఫొటో ఓటరు తుది జాబితాలను ప్రదర్శించారు. ఇప్పటికే పంచాయతీరాజ్​శాఖ.. లోకల్​బాడీ ఎన్నికల కోసం బ్యాలెట్​ బాక్స్​లు, బ్యాలెట్​ పత్రాలు సిద్ధం చేసింది. కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీఎన్నికల నిర్వహణ  కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే.  

షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 9న ప్రదర్శించాలని అధికారులకు ఆదేశించింది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించడానికి కలెక్టర్ ఆమోదంతో ఎంపీడీవో, ఏడీఈఏఎస్ ద్వారా పోలింగ్ స్టేషన్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని కోరింది.  జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారులు .. మండలస్థాయిలో ఎంపీడీవోలు, ఏడీఈఏఎస్ ద్వారా 8న సమావేశం నిర్వహించనున్నారు.  పోలింగ్ కేంద్రాలపై  అభ్యంతరాలను  6 నుంచి 8 వరకు స్వీకరిస్తారు.  ఏమైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే 9న చేపట్టి.. పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను 10న జిల్లా ఎన్నికల అధికారులు ప్రచురించనున్నారు.