
హైదరాబాద్, వెలుగు : విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయకపోవడంపై రాష్ట్ర సర్కారుపై సుప్రీంకోర్టు మంగళవారం సీరియస్ అయింది. ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మందికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ధర్మాధికారి కమిటీ నివేదికే ఫైనల్ అని చెప్పినా.. అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందని స్పష్టం చేసింది.
ఇందుకు విద్యుత్‌శాఖ అధికారులకు జైలుశిక్షే పరిష్కారమని హెచ్చరిస్తూ.. 2 వారాల్లోగా ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ అయిన 84 మందికి వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని, పోస్టింగ్స్ ఇచ్చేందుకు ఇదే చివరి అవకాశమని జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ కృష్ణ మురారి బెంచ్ స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.
రివర్స్ అయిన తెలంగాణ డిస్కంల నిర్ణయం..
రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీ స్థానికత కలిగిన 1157 మంది ఉద్యోగులను రిలీవ్ చేశాయి. ఏపీ సర్కారు తమ విద్యుత్ సంస్థల్లో ఖాళీలు లేవంటూ చేర్చుకోవడానికి నిరాకరించింది. దీంతో వాళ్లంతా సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జస్టిస్ ధర్మాధికారి కమిటీ వేసింది. అభిప్రాయాల సేకరణ తర్వాత రిలీవ్ అయిన వాళ్లే కాకుండా ఇంకో 84 మంది ఏపీ ఉద్యోగులు కూడా తెలంగాణ విద్యుత్ సంస్థల్లో చేరేందుకు ముందుకు రాగా వాళ్లను కూడా చేర్చుకోవాలని కమిటీ రిపోర్టిచ్చింది.
తొలుత రిలీవ్ చేసినోళ్లందరినీ చేర్చుకున్న తెలంగాణ అదనంగా వచ్చిన 84 మందిని చేర్చుకోలేదు. దీంతో వాళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాధికారి నివేదికే ఫైనల్ అని తీర్పునిచ్చింది. అయినా రాష్ట్ర సర్కారు వాళ్లను చేర్చుకోకపోవడంతో మరోసారి సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వాళ్లందరినీ 2 వారాల్లో చేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో 84 మంది ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులను కూడా తెలంగాణ సంస్థల్లో చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి వేతనాలు ఈనెల నుంచి ఇవ్వాలంటూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు ఇచ్చారు.