టీనేజ్ శృంగారంపై..అభిప్రాయం చెప్పండి కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

టీనేజ్ శృంగారంపై..అభిప్రాయం చెప్పండి కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  • పరస్పర అంగీకారంతో దగ్గరైనా జైలు పాలయ్యేది అబ్బాయే..
  • అమ్మాయిల ఏజ్ పరిగణలోకి తీసుకుని శిక్ష.. అబ్బాయి వయస్సునూ లెక్కలో తీసుకోవాలి
  • రోమియో జూలియట్ లా అమలు చేయాలని అడ్వకేట్ పిటిషన్

న్యూఢిల్లీ : 16 నుంచి 18 ఏండ్ల మధ్య వయసున్న వారు పరస్పర అంగీకారంతో శారీరకంగా దగ్గరైతే నేరంగా పరిగణించకూడదంటూ ఓ పిటిషన్ దాఖలైందని, దీనిపై మీ అభిప్రాయం ఏంటని కేంద్రాన్ని సుప్రీం కోర్టు కోరింది. 16 ఏండ్ల లోపు బాలికలతో వారి అనుమతి మేరకు శృంగారంలో పాల్గొన్నా చట్టరీత్యా అది నేరం అవుతున్నదని, ఐపీసీ 375 ప్రకారం దాన్ని అత్యాచారంగా పరిగణిస్తున్నారని, దీని చట్టబద్ధతను సవాలు చేస్తూ హర్ష్‌‌‌‌ విభోర్‌‌‌‌ సింఘాల్‌‌‌‌ అనే అడ్వకేట్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 16 నుంచి 18 ఏండ్ల మధ్య బాలికతో వారి అనుమతి పూర్వకంగా శృంగారం చేసినా కూడా అది నేరమే అవుతున్నదని సింఘాల్ పేర్కొన్నారు. ఒకవేళ బాలిక గర్భం దాల్చిన సందర్భాల్లో ఆమె పేరెంట్స్ కంప్లైంట్​ చేస్తే బాలుడిని అరెస్ట్‌‌‌‌ చేస్తున్నారని వివరించారు. ఇలాంటి కేసుల్లో టీనేజ్ అబ్బాయిలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో సీజేఐ జస్టిస్‌‌‌‌ డీవై చంద్రచూడ్‌‌‌‌, జస్టిస్‌‌‌‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌‌‌‌ మనోజ్‌‌‌‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర న్యాయశాఖ, హోంశాఖ, జాతీయ మహిళా కమిషన్‌‌‌‌ సహా ఇతర చట్టబద్ధ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కోరింది. 

18 ఏండ్లలోపు ఉంటే పోక్సో చట్టం

పోక్సో చట్టం ప్రకారం 18 ఏండ్లలోపు వారిని మైనర్లుగా పేర్కొంటూ లైంగిక చర్యను నేరంగా పరిగణిస్తున్నారని సింఘాల్‌‌‌‌ పేర్కొన్నారు. బాలికతో వారి అనుమతి పూర్వకంగా శృంగారం చేసినా కూడా అది నేరమే అవుతున్నదని, అయితే ఇక్కడే ఓ చిన్న మతలబు ఉందన్నారు. ‘‘బాలిక వయసు సరే.. మరి బాలుడి వయసుని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేదే అసలు సమస్య. ఇండియాలో మాత్రం బాలుడి వయసుని పరిగణలోకి తీసుకోరు. 16 ఏండ్ల బాలికతో ఆమె సమ్మతి మేరకు ఓ మధ్య వయస్కుడు శృంగారం చేసినా అది అత్యాచారమే. అదే వయసు బాలుడు ఆమె అనుమతితో ప్రేమ అనే మోజులో గీత దాటినా కూడా రేప్ కేసులో జైలులో వేస్తారు. ఈ తేడా ఎందుకు?”అంటూ సుప్రీం కోర్టును సింఘాల్ ప్రశ్నించారు. బాలిక వయసు కంటే బాలుడి వయసు నాలుగేండ్ల కంటే ఎక్కువ కానప్పుడు అరెస్ట్‌‌‌‌ నుంచి మినహాయిస్తూ రోమియో- జూలియట్‌‌‌‌ చట్టాన్ని కొన్ని దేశాలు అనుసరిస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీన్ని ఇండియాలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని సింఘాల్ అభిప్రాయపడ్డారు.

రోమియో జూలియట్​​ చట్టం ఏంటి?

చాలా దేశాల్లో 2007 నుంచే రోమియో జూలియట్ చట్టం అమలులో ఉంది. టీనేజ్ అమ్మాయిల అనుమతితో శృంగారంలో పాల్గొంటే విదేశాల్లో కూడా అది నేరం, కానీ.. అబ్బాయి వయసుని కూడా అక్కడ పరిగణలోకి తీసుకుంటారు. అంటే.. అబ్బాయి కూడా టీనేజ్ లో ఉంటే, శృంగారం వారిద్దరి అనుమతితో జరిగితే అందులో ఇద్దరి తప్పు లేదని నిర్ధారిస్తారు. దీన్నే రోమియో జూలియట్ చట్టం అంటారు. అక్కడ అబ్బాయిలకు శిక్ష అరుదుగా ఉంటుంది. మనదేశంలో మాత్రం ఇద్దరూ కలిసి తప్పు చేసినా, మైనర్ బాలిక తల్లిదండ్రులు కేసు పెడితే మాత్రం అబ్బాయి జైలుపాలవ్వాల్సిందే.