
న్యూఢిల్లీ, వెలుగు: స్కీముల పేరుతో అక్రమంగా డిపాజిట్లు సేకరించి రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన హీరా గోల్డ్ వ్యవహారంలో ఖాతాదారులు క్లెయిమ్‌లు చేసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి ఈ నెల 30 వరకు డెడ్‌లైన్ విధిస్తున్నట్లు, ఆపై వచ్చే క్లెయిమ్‌లను పరిగణలోకి తీసుకోలేమని పేర్కొంది. దీనికి సంబంధించి ప్రకటనలు ఇవ్వాలని సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌తో పాటు ఐపీసీలోని తీవ్ర నేరారోపణల కింద విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును గతంలో ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల బెంచ్ గురువారం విచారణ జరిపింది.
హీరా గోల్డ్‌కు చెందిన భూములు, ఆస్తులను అమ్మి డిపాజిటర్ల సొమ్ము చెల్లిస్తామని నిందితురాలి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే, హీరా గోల్డ్ ఆస్తులు అమ్మకం ద్వారా రూ.110 కోట్లకు పైగా వస్తుందని ప్రభుత్వ తరఫు లాయర్ వాదించగా, దాదాపు రూ.800 కోట్లకు కొనేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారని హీరా గోల్డ్ తరఫు లాయర్ వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం..ఇలాంటి సందర్భాల్లో ఆస్తుల కొనుగోలుదారులు తమ వివరాలు చెప్పడానికి ఇష్టపడరని, అందువల్ల పిటిషనర్లు కొనుగోలుదారుల పేర్లను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అమ్మాల్సిన భూమిపై ఎలాంటి అటాచ్‌మెంట్లు ఉన్నా వాటిని తొలగించడానికి అంగీకరిస్తామని పేర్కొంది.ఎస్‌ఎఫ్‌ఐవో పూర్తి విచారణ చేస్తున్నప్పటికీ పలు రాష్ట్రాలు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇస్తున్నాయని పిటిషనర్ న్యాయవాది చేసిన రిక్వెస్ట్‌ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఎస్‌ఎఫ్‌ఐవో పరిశీలించేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు చెప్పింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.