డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐపై సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ వేటు .. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అనూహ్య నిర్ణయం

డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐపై సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ వేటు .. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అనూహ్య నిర్ణయం
  • కొత్త  కార్యవర్గం నిబంధనలు పాటించకుండా నిర్ణయాలు తీసుకోవడమే కారణమని వెల్లడి
  • డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐని నడిపేందుకు అడ్‌‌‌‌‌‌‌‌ హక్ కమిటీ ఏర్పాటు చేయాలని ఐఓఏకు సూచన

న్యూఢిల్లీ : దేశ రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌లో అనూహ్య పరిణామం. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ)కు కొత్త కార్యవర్గం ఎన్నికైన మూడో రోజుల్లోనే ఆ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ను  కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌కు నమ్మకస్తుడైన సంజయ్‌‌‌‌‌‌‌‌ సింగ్ నేతృత్వంలోని కొత్త కార్యవర్గం తమ ఫెడరేషన్ నిబంధనలను పాటించకుండా పలు నిర్ణయాలు తీసుకుందని, అందుకే దాన్ని సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ సస్పెన్షన్ ఉంటుందన్న క్రీడా శాఖ అప్పటిదాకా డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి వీలైనంత త్వరగా అడ్ హక్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)ని  కోరింది.

నిబంధనలను అనుసరించకుండా, పోటీలకు సన్నద్ధం అయ్యేందుకు రెజ్లర్లకు తగిన సమయం ఇవ్వకుండా తొందరపాటుతో  అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌15, అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20 నేషనల్స్‌‌‌‌‌‌‌‌  షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించి డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ రూల్స్‌‌‌‌‌‌‌‌ను అతిక్రమించిందని క్రీడా శాఖ తెలిపింది. ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో గెలిచిన సంజయ్ సింగ్ గంటల వ్యవధిలోనే అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌15, అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20 నేషనల్స్‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 28 నుంచి యూపీలోని గోండాలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి లేకుండానే  టోర్నీలను ప్రకటించడంపై క్రీడా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.  మరోవైపు బ్రిజ్‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు ఆయన అధికారిక బంగ్లాలో డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ కార్యకలాపాలు నిర్వహించారు. ఇక్కడే బ్రిజ్‌‌‌‌‌‌‌‌ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు కూడా ఇదే బంగ్లాను కార్యాలయంగా కొనసాగించడాన్ని క్రీడాశాఖ తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది.

దాంతో, కొత్త ప్యానెల్ పూర్తిగా మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో ఉందని, ఇది స్పోర్ట్స్ కోడ్‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.  ‘కొత్తగా ఎన్నికైన కార్యవర్గం  డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగాన్ని అనుసరించలేదు. కాబట్టి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్ చేస్తున్నాం. అప్పటివరకు దేశంలో రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌ రోజువారీ కార్యకలాపాలపై డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐకి సంబంధం ఉండదు’ అని క్రీడా శాఖ ప్రకటించింది.  సంజయ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికను నిరసిస్తూ  రెజ్లర్ సాక్షి మాలిక్‌‌‌‌‌‌‌‌ రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించగా.. బజ్‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌ పునియా  తన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే.   

రూల్స్‌‌‌‌‌‌‌‌ బ్రేక్ చేయలేదు

తాము ఎలాంటి రూల్స్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేయలేదని ప్రభుత్వానికి వివరించి సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ను తొలగించాలని కోరుతామని డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ చీఫ్ సంజయ్ సింగ్ తెలిపారు. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామన్నారు.

ఇప్పుడెట్ల..

డబ్ల్యూఎఫ్ఐని క్రీడా శాఖ సస్పెండ్ చేయడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో డబ్ల్యూఎఫ్ఐని ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్‌ బ్యాన్ చేసింది. మొన్న ఎన్నికలు జరిగిన వెంటనే బ్యాన్‌ తొలగించాలని సంజయ్ వరల్డ్ ఫెడరేషన్‌ను కోరారు. కానీ, ఇప్పుడు ఫెడరేషన్‌ను క్రీడాశాఖ సస్పెండ్ చేయడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న విషయంలో క్లారిటీ లేదు. పారిస్ ఒలింపిక్స్  సమీపిస్తుండగా ఫెడరేషన్ రాజకీయాలు దేశ రెజ్లింగ్‌ను కుదిపేస్తున్నాయి. ఈ వివాదాన్ని క్రీడాశాఖ, ఐఓఏ  ఎలా ముగిస్తాయో చూడాలి. 

మంచికి మొదటి అడుగు : సాక్షి

కేంద్ర క్రీడా శాఖ నిర్ణయాన్ని రెజ్లర్లు సాక్షి మాలిక్, బజ్‌‌‌‌‌‌‌‌రంగ్ పునియా స్వాగతించారు. ‘మంచి జరగడానికి ఇది మొదటి అడుగు. మేము పోరాడుతున్న కారణాన్ని ప్రభుత్వం మరింత అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా. ఒక మహిళ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌కు ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉండటం మహిళా రెజ్లర్ల భద్రతకు మంచిది’ అని సాక్షి తెలిపింది. సంజయ్ సింగ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికకు నిరసనగా శుక్రవారం తన పద్మశ్రీని ప్రభుత్వానికి వాపస్ ఇచ్చిన బజ్‌‌‌‌‌‌‌‌రంగ్ పునియా ఆ అవార్డును వెనక్కి తీసుకోనని చెప్పాడు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగిన తర్వాతనే  పద్మశ్రీని  వెనక్కి తీసుకోవడం గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.

రిటైర్మెంట్ తీసుకుంటున్నా : బ్రిజ్ భూషణ్ 

డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐపై సస్పెన్షన్ వేటు పడిన వెంటనే  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన ఎంపీ బ్రిజ్‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌ను తాను రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని  ప్రకటించాడు. వచ్చే ఏడాది లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎలక్షన్స్ సహా మరిన్ని బాధ్యతలు చూడాల్సి ఉన్నందున  కొత్తగా ఎన్నికైన మెంబర్లు ఇప్పుడు డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐని చూసుకుంటారని చెప్పారు.  ఇక, ఆటగాళ్లు తమ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఓ ఏడాదిని కోల్పోకూడదనే ఉద్దేశంతో అండర్ 15, 20 నేషనల్స్‌‌‌‌‌‌‌‌ను త్వరగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బ్రిజ్ స్పష్టం చేశారు.