స్వదేశీ అంతరిక్ష సాంకేతికతకు విజయం స్కైరూట్. ఒకప్పుడు విదేశీ సాంకేతికతపై ఆధారపడిన దేశం నేడు ప్రపంచానికి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను అందించే స్థాయికి చేరుకోవడం భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తల కృషికి నిదర్శనం. స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ, దేశాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా స్వావలంబన దిశగా నడిపించే మేడ్ ఇన్ ఇండియా వంటి జాతీయ కార్యక్రమాలు నేడు ప్రత్యక్ష ఫలితాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల ప్రవేశం ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచింది.
భా రత అంతరిక్ష ప్రయోజనం 1960లలో అత్యంత పరిమిత వనరులతో ప్రారంభమైంది. డా. విక్రమ్ సారాభాయ్ భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి అంతరిక్ష సాంకేతికత విలాసం కాదని, అది సామాజికాభివృద్ధికి అవసరమైన సాధనమని విశ్వసించారు. ఆయన చూపిన మార్గంలో డా. సతీష్ ధావన్, డా. ఏపీజే. అబ్దుల్ కలాం వంటి మహనీయులు భారత అంతరిక్ష కార్యక్రమాన్ని బలోపేతం చేశారు. ఈ దీర్ఘ ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ సంస్థగా ఎదిగి, తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ప్రయోగాలను నిర్వహించే సామర్థ్యాన్ని సంపాదించింది. ఈ బలమైన పునాదులపై నిర్మితమైన కొత్త అధ్యాయం ప్రైవేటు రంగ ప్రవేశం. ప్రభుత్వ విధాన సంస్కరణలతో అంతరిక్ష రంగం ప్రైవేటు సంస్థలకు తెరుచుకోవడం ద్వారా భారత యువతకు, స్టార్టప్‌లకు అపూర్వ అవకాశాలు లభించాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్కైరూట్ ఏరోస్పేస్ వంటి సంస్థలు స్వదేశీ రాకేట్ సాంకేతికత అభివృద్ధిలో విశేష పురోగతి సాధించాయి. దేశీయ ఇంజినీరింగ్ నైపుణ్యం, వినూత్న ఆవిష్కరణలు, యువ శాస్త్రవేత్తల ప్రతిభ కలిసి భారత అంతరిక్ష రంగంలో ఒక కొత్త పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టాయి.
కీలక భాగస్వాములుగా ప్రైవేటు సంస్థలు
విక్రమ్శ్రేణి రాకెట్లు ఒక సాంకేతిక ఉత్పత్తి మాత్రమే కాదు. అధునాతన పదార్థాలు, త్రిమితీయ ముద్రణ (3డి ప్రింటింగ్), స్వదేశీ ప్రొపల్షన్ వ్యవస్థలు, ఆధునిక డిజిటల్ తయారీ సాంకేతికతలతో రూపొందుతున్న ఈ రాకెట్లు భారత పారిశ్రామిక నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. అంతరిక్ష రంగంలో ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థలు కూడా కీలక భాగస్వాములుగా ఎదగగలవని ఇవి నిరూపిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా అనేది ఆ సామర్థ్యానికి గుర్తింపు. ఆత్మనిర్భర్ భారత్ ఆ భావనకు ఆర్థిక, వ్యూహాత్మక బలం, ఈ మూడు లక్ష్యాలు అంతరిక్ష రంగంలో స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. స్వదేశీ సాంకేతికతతో తయారైన ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాలు, అనుబంధ పరికరాలు భారతదేశాన్ని దిగుమతులపై ఆధారపడే దేశం నుంచి సాంకేతికతను ఎగుమతి చేసే దేశంగా మార్చే దిశంగా ముందుకు తీసుకువెళుతున్నాయి. వ్యవసాయం, వాతావరణ సూచనలు, విపత్తు నిర్వహణ, సమాచార ప్రసారం, విద్య, వైద్యం, రక్షణ, నావిగేషన్, వాణిజ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాలకు ఇది కీలక ఆధారం.
విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించాలి
స్కైరూట్ వంటి స్టార్టప్‌లు యువతకు ఒక
స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. సృజనాత్మకతక ఆలోచనలకు, శాస్త్రీయ పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తోంది. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. చిన్న ఉపగ్రహాల ప్రయోగాలు, వాణిజ్య అంతరిక్ష సేవలు, అంతరిక్ష డేటా విశ్లేషణ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. . స్వదేశీ సాంకేతికత ప్రపంచ పోటీలో భారత స్థానాన్ని బలోపేతం చేయడానికి అత్యంత కీలకం. స్కైరూట్ వంటి సంస్థల విజయాలు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్చుతున్నాయి. దేశంలో ప్రతిభకు అవకాశాలు కల్పిస్తే, అనుకూల విధానాలు అమలు చేస్తే, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగం సమన్వయంతో పనిచేస్తే అసాధ్యమనే లక్ష్యాలు కూడా సుసాధ్యం అవుతాయి.
- డా. రావుల కృష్ణ
అసిస్టెంట్ ప్రొఫెసర్,
హెచ్‌సీయూ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
