కష్టాల్లో కళాకారులు: ఉద్యమంలో పని చేసిన వేల మందికి మొండి చేయి

కష్టాల్లో కళాకారులు: ఉద్యమంలో పని చేసిన వేల మందికి మొండి చేయి
  • ఉపాధి లేక, పూట గడవక అవస్థలు
  • సాంస్కృతిక సారథి పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం
  •  హైకోర్టు 3నెలల గడువిస్తే మూడేండ్లైనా పూర్తి చేయని సర్కార్
  • పాతోళ్లకే జీతాలిస్తూ పథకాలపై ప్రచారం
  • ఉద్యమంలో పని చేసిన 3500 మందికి మొండి చేయి

బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడేవరకూ ఆట, పాటలు, డప్పు చప్పుళ్లు, గజ్జెల మోతలు ఆగకూడదు. ఉద్యమాన్ని ప్రజల వద్దకు చేర్చిన ఘనత ముమ్మాటికీ కళాకారులదే. కళాకారుల వల్లనే ఉద్యమం అజేయశక్తిగా మారింది. వారికి ఉద్యోగాలివ్వడం అనేది చాలా చిన్న అంశం. ఉద్యోగాలతో పాటు వారి కుటుంబాలకు హెల్త్‌‌కార్డులు కూడా ఇస్తాం.
                                                                                                                                          - 2015 ఏప్రిల్ 20న సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గాయకులు సర్కార్ కంటికి కనిపిస్తలేరు. ఉపాధి లేక, పూట గడవక గోస పడుతున్నరు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుంటాయని రాత్రనక, పగలనక రాష్ట్రమంతా ‘ధూంధాం’లతో జంగ్‌ సైరన్‌ ఊదిన కవులు, గాయకులు ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నరు. ఉద్యమంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆడిపాడిన కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా మూడు వేలకుపైగా ఉంటే ప్రభుత్వం  కేవలం 550 పోస్టులకే పరిమితం చేయడంతో అనేక మంది ప్రస్తుతం అవకాశాలు దొరకక ఉపాసముంటున్నరు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆ పోస్టులను కూడా ఇప్పటి వరకు భర్తీ చేయకపోవడంతో ఏండ్లుగా ఎదురుచూస్తున్నరు.
3 నెలలు గడువిస్తే.. మూడేండ్లైనా పూర్తి చేయలే..
తెలంగాణ ఏర్పాటు తర్వాత కళాకారుల్లో కొందరికి సాంస్కృతిక సారథి పేరిట ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఈ నియామకాలను ఇష్టారాజ్యంగా చేపట్టారని.. అర్హులకు అవకాశం ఇవ్వలేదని యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన జె.రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మరో ఇద్దరు 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన హైకోర్టు ఆ నియామకాలను రద్దు చేస్తూ.. 2018 జులై 10న తీర్పునిచ్చింది. నచ్చినోళ్లకు కొలువులు ఇస్తే కుదరదని, మూడు వారాల్లో నోటిఫికేషన్ ఇచ్చి, మూడు నెలల్లో పోస్టుల భర్తీ చేయాలని హైకోర్టు చెప్పి మూడేండ్లు దాటినా ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. తీర్పు వచ్చిన రెండు నెలలకే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో  తీర్పు అమలులో తీవ్ర జాప్యం జరిగింది. రెండోసారి టీఆర్ఎస్  అధికారంలోకి వచ్చాక 550 పోస్టుల భర్తీకి 2018 డిసెంబర్ నెలాఖరులో నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల  చేసి, 2019 జనవరి 1 నుంచి 19 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లికేషన్లు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,500 మంది కళాకారులు ఉద్యోగాల కోసం అప్లయ్ చేసుకోగా, అదే ఏడాది నవంబరు  25వ తేదీ  నుంచి డిసెంబర్ 7 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు జరిగి ఏడాదిన్నర దాటినా తుది ఫలితాలు వెల్లడించలేదు.
పాతోళ్లకే మూడేండ్లుగా జీతాలు
సాంస్కృతిక సారథిలో కళాకారుల పోస్టుల భర్తీని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ తమకు నచ్చినవాళ్లకు జీతాలు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఏడాదిన్నర కింద జరిపిన ఇంటర్వ్యూల్లోనూ 516 మందిని పాతవాళ్లనే సెలక్ట్ చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం 34 మంది కొత్త వాళ్లకు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా 3,500 మంది వరకు ఉంటే ప్రభుత్వం 550 మందిని మాత్రమే తీసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

కళాకారులను సర్కార్ పట్టించుకోట్లే
తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు, గాయ కులు, రచయితలు, ఒగ్గు, డప్పు, కోలాట  కళాకారు లు, జానపద కళాకారులు అనేక మంది ఆడి పాడిన్రు. రాష్ట్రమొచ్చాక కళాకారులను ఆదుకుంటా మని చెప్పిన సీఎం కేసీఆర్.. ఒక నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా నచ్చిన కొందరితో పోస్టులు భర్తీ చేసిన్రు. హైకోర్టు దాన్ని రద్దు చేసింది. మూడేండ్ల కింద నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్రంలోని కళాకారులంతా దరఖాస్తు పెట్టుకున్నరు. ఇంటర్వ్యూలు అయిపోయి 21 నెలలు దాటినా రిజల్ట్ చెప్తలేరు. పైగా పాతోళ్లకే జీతాలు ఇచ్చుకుంటూ పని చేయించుకుంటున్నరు. ఉద్యోగాల సంఖ్యను పెంచి అర్హులైన కళాకారులందరికీ న్యాయం చేయాలి.                      - అనువోజు వెంకటేశ్, హుస్నాబాద్, సిద్దిపేట