చిల్లర పేరుతో బాదుడు..ఆర్టీసీ టికెట్ చార్జీలు రౌండ్ ఫిగర్!

చిల్లర పేరుతో బాదుడు..ఆర్టీసీ టికెట్ చార్జీలు రౌండ్ ఫిగర్!

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ టికెట్‌‌ చార్జీలను రౌండ్‌‌ ఫిగర్‌‌ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్​లో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. చిల్లర సమస్యలు తీరుతాయని ఆర్టీసీ మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్ చార్జీలు రౌండ్ ఫిగర్ చేస్తే ఆర్టీసీకి ఆదాయం పెరిగి కాస్త ఊరట లభించనుంది. కానీ టికెట్ చార్జీలు పెరిగి ప్రయాణికులపై భారం పడనుంది. పోయినేడు సమ్మె తర్వాత టికెట్‌‌ పై కిలోమీటరుకు రూ.20పైసల చొప్పున పెంచారు. ఆ తర్వాత చిల్లర సమస్య ఉండొద్దని, చార్జీలను రౌండ్‌‌ ఫిగర్‌‌ చేయాలని నిర్ణయించారు. అయితే అది పూర్తిగా అమలు కాలేదు. ప్రస్తుతం గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ తో పాటు కొన్ని సర్వీసులకు మాత్రమే అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే పల్లె వెలుగు మొదలుకొని అన్ని బస్సుల్లోనూ చార్జీలను రౌండ్‌‌ ఫిగర్‌‌ చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు
పేర్కొన్నారు.

చార్జీ రూ.13 ఉంటే రూ.15 చేస్తరు..

ప్రస్తుతం జిల్లాల్లో చార్జీలు కొంచెం గందరగోళంగా ఉన్నాయి. రూ. 13, రూ. 17, రూ. 23గా ఉన్న చార్జీలను రూ.15, రూ. 20, రూ.25కి పెంచి రౌండ్ ఫిగర్ చేయనున్నారు. ఇప్పటికే మెదక్ డిపోలో చార్జీలను రౌండ్ ఫిగర్ చేసేశారు. మెదక్‌‌ నుంచి కొల్చారం వరకు ఆర్డినరీ బస్ కు రూ.13 చార్జీ కాగా, ఇప్పుడు దాన్ని రూ.15కు పెంచారు. అయితే రౌండ్‌‌ ఫిగర్‌‌ ప్రకారం రూ.21 ఉన్న టికెట్‌‌ను రూ.20 చేయాలి. కానీ రూ.25కు పెంచినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్న పిల్లల టికెట్‌‌కు సంబంధించి.. పెద్దవాళ్ల టికెట్ చార్జీ రూ.25 ఉంటే, పిల్లలకు రూ.15గా రౌండ్ ఫిగర్ చేయనున్నారు.

చిల్లర లొల్లి లేకుండా..

బస్సుల్లో ఎక్కువగా చిల్లర సమస్యలు ఎదురవుతున్నాయి. ప్యాసింజర్లు సరిపడా చిల్లర ఇవ్వకపోవడం, కండక్టర్ల వద్ద చిల్లర లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కండక్టర్లు ఇద్దరు, ముగ్గురు ప్రయాణికులకు కలిపి ఒకే నోటు ఇచ్చి చిల్లర తీసుకొమ్మని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కండక్టర్ టికెట్ వెనుక రాసిన చిల్లరను ప్యాసింజర్లు మరిచిపోతున్నారు. ఇలా అనేక సందర్భాల్లో ప్యాసింజర్లు, కండక్టర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆర్టీసీ అధికారులకు ఇలాంటి ఫిర్యాదులే ఎక్కువ వస్తున్నాయి. చార్జీలను రౌండ్ ఫిగర్ చేస్తే, ఈ సమస్యలన్నీ తీరుతాయని అధికారులు అంటున్నారు.

ప్రయాణికులపై భారం..

టికెట్‌‌ చార్జీలను రౌండ్‌‌ ఫిగర్‌‌ చేస్తే ప్రయాణికులపై భారం పడనుంది. టికెట్‌‌పై రూ.2 నుంచి రూ.4 పెరగనుంది. అంటే రానూపోను అదనంగా 4 నుంచి 8 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. కరోనాతో చేతిలో డబ్బుల్లేక, ఉద్యోగాల్లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం పడనుంది. ప్రస్తుతం రోజుకు 20లక్షల మందిని ఆర్టీసీ గమ్యాలకు చేరుస్తోంది. ఈ లెక్కన గ్రేటర్‌‌ తీసేసినా, రోజుకు రూ.30 లక్షల ఆదాయం పెరిగే చాన్స్ ఉంది. ఆర్టీసీకి ప్రస్తుతం రోజుకు రూ.10 కోట్ల వరకు కలెక్షన్‌‌ వస్తోంది.