పరీక్షల నిర్వహణలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారు..?: హైకోర్టు

పరీక్షల నిర్వహణలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారు..?: హైకోర్టు

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్ పై గురువారం (జూన్ 22న) తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడం, ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫోటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఓఎంఆర్ షీటుపై హాల్‌టికెట్ నెంబరు, ఫోటో ఎందుకు లేవని, అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను న్యాయస్థానం ప్రశ్నించింది. అక్టోబరులో చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదు, పరీక్షల్లో అక్రమాల నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టు అడిగింది.

అయితే.. పరీక్షల ఏర్పాట్లు ఎలా చేయాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణ అధికారమని కమిషన్ న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫోటోకు సుమారు రూ.1.50 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. 

ఆధార్ వంటి గుర్తింపు కార్డు ద్వారా ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ధ్రువీకరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్పీఎస్సీ బాధ్యత మాత్రమే అని చెప్పింది. పరీక్ష నిర్వహణ విషయంలో ఖర్చులు  ముఖ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్‌పీఎస్సీ బాధ్యత అని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకున్నారు కదా...? అని ప్రశ్నించింది. వీటన్నింటిపై మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.