- కొత్తగా రిక్రూట్ అయ్యే వారికి వర్తింపు
- హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు
- తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్‌కు సవరణ
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ డాక్టర్ల విషయంలో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా రిక్రూట్ అయ్యే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. మంగళవారం హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనల్లో సవరణలు చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ డాక్టర్లు, క్లినికల్, నాన్ క్లినికల్‌తోపాటు సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లకు చెందిన డాక్టర్లకూ ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొన్నారు. క్లినికల్‌లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, అనస్తీషియా, రేడియో డయాగ్నసిస్, ఆంకాలజీ, ఆప్తమాలజీ, హస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫిజికల్ మెడిసిన్, ఎమర్జెనీ మెడిసిన్ తదితర వైద్యులు ఉన్నారు.
నాన్ క్లినికల్‌లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ట్రాన్యూజియన్ మెడిసిన్ వైద్యులున్నారు. సూపర్ స్పెషాలిటీ విభాగంలో కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్లు ఉన్నారు. ఈ కేటగిరీలకు సంబంధించి.. రిక్రూమెంట్ చేయకూడదని జీవోలో సర్కారు స్పష్టం చేసింది. మరోవైపు స్పెషలిస్టు వైద్యులంతా విధిగా తమ పీజీ డిగ్రీలను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ జీవోపై వైద్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది స్వాగతిస్తున్నారు. మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు.ఎయిమ్స్ తరహాలో వేతనాలిచ్చి, ప్రైవేటు ప్రాక్టీస్‌ను బ్యాన్ చేస్తే తమకేం అభ్యంతరం ఉండదని కొందరు డాక్టర్లు అంటున్నారు.
