సర్కారును గద్దెదించే టైమొచ్చింది .. దేశంలోని అన్ని వర్గాలు ఏకం కావాలి: రాహుల్ గాంధీ

సర్కారును గద్దెదించే టైమొచ్చింది .. దేశంలోని అన్ని వర్గాలు ఏకం కావాలి: రాహుల్ గాంధీ
  • ప్రధాన్ రాజీనామా విద్యావ్యవస్థ పునర్నిర్మాణానికి ముందడుగని వెల్లడి
  • విద్యార్థులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..
  • స్టూడెంట్లకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ 
  • విద్యార్థులు, యువతకు అభినందనలు

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని.. దేశంలోని అన్ని వర్గాలు ధైర్యంచేసి ముందుకు రావాలని కాంగ్రెస్​ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ ​గాంధీ పిలుపునిచ్చారు. శనివారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన తన ఎక్స్​ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్​చేశారు. ‘ఢరో మత్ (భయపడొద్దు). భారతదేశంపై దాడి చేస్తూ, మన రాజ్యాంగాన్ని నాశనం చేస్తూ, మన సంస్థలన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్న ఈ పాలనను వదిలించుకుందాం.

సమాజంలోని ఇతర వర్గాలైన రైతులు, కార్మికులు, పేదలు ఏకం కావాలి. ఈ ప్రభుత్వం అణచివేసి, అణగదొక్కిన ప్రతి ఒక్కరూ తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధంగా దృఢంగా నిలబడటంలోనే నిజమైన ధైర్యం ఉంది’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులకు, యువతకు రాహుల్​అభినందనలు తెలిపారు. ‘మీ అందరి పట్ల మేము గర్విస్తున్నాము. చాలా బాగా చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి వీధుల్లోకి వచ్చి దృఢంగా నిలబడిన ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు. నిలబడటంలో వివేకం, ధైర్యం ఉన్నాయి’ అని ఆయన అన్నారు.

విద్యా వ్యవస్థను పునర్నిర్మించే దిశగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక పెద్ద ముందడుగు అని రాహుల్ అన్నారు. అయితే, మరో రెండు డిమాండ్లు ఇంకా పెండింగ్‌‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ‘మొదటిది, మన విద్యార్థులపై చేయి చేసుకున్నవారు, వారిపై కాల్పులు జరిపినవారు అందరూ శిక్ష అనుభవించాలి. అలాగే, క్రూరమైన హింస, దాడికి గురైన విద్యార్థులకు భారతదేశ భవిష్యత్తు పట్ల గౌరవంతో ప్రధాని క్షమాపణ చెప్పాలి’ అని రాహుల్​ డిమాండ్​ చేశారు.

అదే విధంగా మన దేశ విద్యా వ్యవస్థ ఎంతో గొప్పదని, ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉందని రాహుల్​ అన్నారు. అలాంటి వ్యవస్థను కేంద్రం క్రమంగా ప్రైవేటీకరిస్తున్నదని విమర్శించారు. ఆర్​ఎస్​ఎస్​దొడ్డిదారిన మన విద్యా వ్యవస్థలోకి దూరి నాశనం చేసిందని ఫైర్​ అయ్యారు.

నరేంద్ర మోదీ ఇక గతం..

నరేంద్ర మోదీ ఇక భారతదేశపు గతమని రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. గతం ఎప్పటికీ భవిష్యత్తుతో పోరాడలేదని ఆయన పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధులు కేంద్రంతో చర్చలకు వెళ్లే మందు 10 జన్​పథ్ బయట రాహుల్​గాంధీ మీడియాతో మాట్లాడారు. సోమవారం నిరసనకారులు జరిపిన పార్లమెంటు మార్చ్ సందర్భంగా వారిపై లాఠీచార్జి, పెల్లెట్ గన్‌‌ల వాడకం వంటి మితిమీరిన బలప్రయోగాన్ని రాహుల్​ ఖండించారు.

ప్రధాని మోదీ దేశంలోని విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. విద్యార్థులపై హింసకు హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రధాన్‌‌కు గట్టిగా అండగా నిలుస్తోందన్నారు. ఇది భారతదేశ విద్యార్థులకు ఆమోదయోగ్యం కాదన్నారు.