V6 News

జ్ఞానవాపి మసీదు కేసు..నేడు వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు

జ్ఞానవాపి మసీదు కేసు..నేడు వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జ్ఞానవాపిలో శివలింగం దొరికిన ప్రదేశంలో పూజలకు అనుమతి ఇవ్వాలంటూ గతంలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. పూజలకు అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నవంబర్ 8వ తేదీన ఈ కేసు తీర్పును నవంబర్ 14కు వాయిదా వేసింది. శివలింగానికి పూజలతో పాటు ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని హిందువులకు అప్పగించాలని పిటిషన్ దారులు కోరారు. 

అంతకుముందు.. శివలింగం వయసు తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం వారణాసి కోర్టును కోరింది. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. వారణాసి సివిల్ కోర్టు ఆదేశాల మేరకు గతంలో జ్ఞానవాపి మసీదును వీడియో సర్వే చేశారు. దీంట్లో వాజూఖానాలో ఓ కొలనులో శివలింగం ఆకారం లభించింది. ఇది కాశీ విశ్వనాథుడి శివలింగమే అని హిందూ పక్షం చెబుతోంది. ఇదిలా ఉంటే ఇది కొలనులోని ఫౌంటేన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు వారణాసి కోర్టు ఏం తీర్పు చెబుతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది.