నా మీద దాడికి టీఆర్ఎస్ నాయకులు ప్లాన్ చేసిన్రు

నా మీద దాడికి టీఆర్ఎస్ నాయకులు ప్లాన్ చేసిన్రు

హైదరాబాద్: నా మీద దాడి చేయడానికి టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారని, కానీ ప్రజలు నాకు రక్షణగా నిలవడంతో ఏమీచేయలేక వెనుదిరుగారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో.. ఎమ్మెల్యే రఘునందన్ రావు నిన్న  కూరగాయల మార్కెట్ ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ నేతలు రఘునందన్ రావును అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కాగా.. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమవేశంలో పోలీసుల తీరుపై రఘునందన్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మార్కెట్ నిర్మిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. మీటింగ్ ప్రదేశానికి పెద్ద సంఖ్యలో వచ్చిన టీఆర్ఎస్ గూండాలు.. తన మీద దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

ఇంత జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారన్నారు. తమ కార్యకర్తలు, గ్రామస్థులు టీఆర్ఎస్ గూండాలను అడ్డుకున్నారన్నారు. అదనపు బందోబస్తు కోసం సీఐ, ఏసీపీలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఒక ఎమ్మెల్యేకే ఈ రాష్ట్రంలో రక్షణ లేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఊహించుకోవాలన్నారు. గ్రామస్థులే నన్ను అడ్డుకున్నారని టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తనను మాట్లాడనివ్వకుండా కరెంట్ కట్ చేస్తున్నారని, టీఆర్ఎస్ మీటింగుల్లో కూడా ఇలాగే జరుగుతుందా అని ప్రశ్నించారు. ఈ రోజు సాయంత్రం డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు రఘునందన్ రావు చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం:

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శరత్ కన్నుమూత

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె