న్యూఢిల్లీ: దేశంలో వేసవి తీవ్రత, ఎండల వేడి నుంచి క్రికెటర్లకు, అభిమానులకు ఉపశమనం కలిగించేందుకు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌ను ముందుగా ప్రారంభించాలని భావిస్తోంది. భవిష్యత్ ఐపీఎల్ సీజన్ల కోసం మార్చి 10 నుంచి మే 15 వరకు విండోను కేటాయించేలా ప్లాన్ చేస్తున్నామని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ క్యాలెండర్ ఇబ్బందుల వల్ల టోర్నీలో మ్యాచ్‌ల సంఖ్య 74కే పరిమితం కానుందన్నాడు. దీనిని 94కు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. కొత్త షెడ్యూల్‌ను రెండు వారాలు ముందుకు జరపడంపై బీసీసీఐ వర్గాల్లో, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో చర్చలు జరుగుతున్నట్లు సైకియా తెలిపాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 28న ప్రారంభమై మే 31తో ముగిసింది. మే 15 తర్వాత టోర్నీ చివరి దశకు వచ్చేసరికి దేశంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఉత్తర, పశ్చిమ భారత దేశాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇది అటు ఆటగాళ్లకు, ఇటు మైదానానికి వచ్చే ప్రేక్షకులకు ఏమాత్రం అనుకూలం కాదు’ అని సైకియా పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరగబోయే 20వ ఐపీఎల్ ఎడిషన్ నాటికి ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు ఎలాంటి వాతావరణ ఆటంకాలు లేకుండా మే 15 లోపే టోర్నీని పూర్తి చేయాలనేది బీసీసీఐ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
