ఎమ్మెల్యే అరూరి రమేశ్కు చుక్కెదురు

 ఎమ్మెల్యే అరూరి రమేశ్కు చుక్కెదురు

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పర్యటించి, ఆసరా పెన్షన్లు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయగా.. పలుచోట్ల చుక్కెదురైంది. గతంలో ప్రారంభించిన  పనులు పూర్తి కాలేదని, అర్హులకు పెన్షన్లు అందడం లేదని పలువురు ప్రశ్నించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కొత్త పెన్షన్ కార్డులు అందజేయగా.. తాము అప్లై చేసుకున్నా రాలేదని కొందరు ఆందోళన చేశారు. గ్రామం నుంచి ఇల్లంద వెళ్లే రూట్​లో బ్రిడ్జి పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని నిలదీశారు.

ల్యాబర్తి గ్రామంలోనూ అర్హులకు పెన్షన్లు అందలేదని కొందరు వాపోయారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించగా.. రూ.3లక్షలు ఇస్తామని చెప్పి అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అనంతరం బొక్కలగూడెం, చంద్రు తండా, రాంధన్ తండాల్లో పర్యటించి పెన్షన్ కార్డులు అందజేశారు. మండలవ్యాప్తంగా మొత్తం 251మందికి కొత్తగా పింఛన్లు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో రూ.1.80కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు, శ్మశానవాటికలు, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్ యార్డులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ల్యాబర్తి, చంద్రు తండాల్లో కొత్త జీపీ బిల్డింగ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.