వీఆర్ఎస్ ఆర్టీసీ ఉద్యోగుల్లో సందేహాలు

 వీఆర్ఎస్ ఆర్టీసీ ఉద్యోగుల్లో సందేహాలు
  • డిపో నోటీసు బోర్డుల్లో ప్రకటన 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో వాలంటరీ రిటైర్ మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) మళ్లీ తెరపైకి వచ్చింది. ఆసక్తి ఉన్నోళ్లు వీఆర్ఎస్ కు అప్లై చేసుకోవాలంటూ శుక్రవారం ఉదయం డిపోల్లో బోర్డులపై నోటీసులు అంటించారు. ఈ నెల 16 లోగా పేర్లు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ నెల 14న రాత్రి ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో వీటిని అంటించినట్లు తెలుస్తోంది. కానీ వీఆర్ఎస్ పై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎలాంటి గైడ్ లైన్స్ గానీ, అధికారికంగా ఉత్తర్వులు గానీ ఇవ్వలేదు. దీంతో దీనిపై ఉద్యోగుల్లో సందేహాలు నెలకొన్నాయి. వీఆర్ఎస్ కు ప్రకటన ఇచ్చి, కేవలం రెండ్రోజులే సమయం ఇవ్వడం ఏమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇది నిజంగానే వీఆర్ఎస్ కోసమా? లేక మరోసారి ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకునేందుకా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి గైడ్ లైన్స్, సర్క్యులర్ ఇవ్వకుండా ఇలా ప్రకటన జారీ చేయడమేంటని మండిపడుతున్నారు. కావాలనే వీఆర్ఎస్ ను చర్చకు తీసుకొస్తున్నారని, నిజంగా వీఆర్ఎస్ ఇచ్చే ఆలోచన అధికారులకు లేదని అంటున్నారు. 

గతంలో ఓసారి సర్వే... 

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 9 వేల బస్సులు నడుపుతుంటే, అందులో 3 వేల అద్దె బస్సులు ఉన్నాయి. మొత్తం 48 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా, వారిలో డ్రైవర్లు, కండక్టర్లే ఎక్కువ ఉన్నారు. సంస్థకు ఆర్థికంగా భారం పడుతుండడంతో ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించాలని భావిస్తున్న ఆర్టీసీ.. గత కొన్ని నెలలుగా వీఆర్ఎస్ పై దృష్టిపెట్టింది. అదనంగా ఉన్న స్టాఫ్ ను తగ్గించుకునేందుకు వీఆర్ఎస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం మూడు నెలల కింద సర్వే నిర్వహించింది. వీఆర్ఎస్ పై ఆసక్తి ఉన్నోళ్లు రిజిస్టర్లలో సంతకాలు చేయాలని చెప్పింది. దీనికి స్పందించి పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులు ముందుకొచ్చారు. దాదాపు 2 వేల మంది వీఆర్ఎస్ కు ఆసక్తి చూపారు. కానీ అప్పటి నుంచి దాని ఊసే లేకుండా పోయింది. కాగా, ప్యాకేజీ కింద ఒక్కో ఉద్యోగికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు వేసుకున్నా 2 వేల మందికి రూ.600 కోట్ల దాకా అవుతుంది. ఈ విధానాన్ని నిజంగానే అమలు చేస్తే ఉద్యోగుల ఇంతకు రెట్టింపు ఉంటుందని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. ఈ లెక్కన రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్లు అవసరమవుతాయని చెబుతున్నారు.

21న జేఏసీ మీటింగ్

వీఆర్ఎస్ విషయంలో అధికారుల తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఎలాంటి గైడ్ లైన్స్, సర్క్యులర్ లేకుండా ప్రకటనలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే వీఆర్ఎస్ ఇవ్వాలనుకుంటే ప్యాకేజీ, విధివిధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 21న జేఏసీలోని 8 సంఘాలు భేటీ అయి చర్చించాలని నిర్ణయించాయి. అవసరమైతే పోరాటం చేస్తామని ఆయా సంఘాల నాయకులు అంటున్నారు. 

ఇది పద్ధతి కాదు...

ఆర్టీసీ అనుసరిస్తున్న పద్ధతి కరెక్టు కాదు. గైడ్ లైన్స్, సర్క్యులర్ ఇవ్వకుండా కేవలం రెండు రోజుల గడువు ఇస్తూ వీఆర్ఎస్ కు సంతకం పెట్టాలనడం అన్యాయం. గతంలోనూ వీఆర్ఎస్ అంటూ హడావుడి చేసి సైలెంట్ గా ఉన్నారు. దీనిపై మేమంతా చర్చించుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించుకుంటాం.

-  వీఎస్ రావు, జనరల్ సెక్రటరీ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్