తెలుగు బిగ్ బాస్: చాట్ భాండార్ తెరిచిన నాగ్

తెలుగు బిగ్ బాస్: చాట్ భాండార్ తెరిచిన నాగ్

వీకెండ్ వచ్చేసింది. నాగార్జున రానే వచ్చారు. ప్రేక్షకులంతా ఈ ఎపిసోడ్ కోసమే వారమంతా వెయిట్ చేస్తుంటారు. కంటెస్టెంట్స్ కూడా వెయిట్ చేస్తారు. కాకపోతే కాస్త భయంగా. ఎందుకంటే వారమంతా వాళ్లు చేసిన తప్పులకి నాగార్జున ఎలాంటి క్లాస్ తీసుకుంటారో, ఏ పనిష్మెంట్ ఇస్తారో తెలియదు కాబట్టి. మరి ఈవారం నాగ్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎవరికి ప్రశంసలు దక్కాయి? ఎవరికి మొట్టికాయలు పడ్డాయి?

ఆదిరెడ్డి ఏం పీకాడు? సూర్య ఎందుకిలా చేశాడు?

ఎపిసోడ్ మొదలవుతూనే ప్రేక్షకులతో కాసేపు మాట్లాడారు నాగ్. నేనే వంట చేశాను కదా, ఫుడ్ వేస్ట్ అని పడేస్తారా అంటూ ఆడియెన్స్ ని అడిగారు. వాళ్లు నో అన్నారు. అది కరెక్ట్ కాదు కాబట్టి అలా చేసినవాళ్లకి పనిష్మెంట్ ఇద్దాం అన్నారు. ఆడపిల్లకి ఏజ్ గురించి మాట్లాడడం, గీతూ ఏడవడం, బాలాదిత్యకి కోపం రావడం లాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదామంటూ హౌస్‌మేట్స్ ముందుకెళ్లారు నాగ్. ముందుగా ఆది గురించి మొదలెట్టారు. ఫుడ్ పడేస్తే పనిష్మెంట్ ఇవ్వకుండా ఏం పీకావ్ అంటూ సూర్య అన్నం పడేసిన వీడియోని చూపించారు. ఈ విషయం నీకు తెలుసా అని అడిగితే తెలియదన్నాడు. ఆ తర్వాత సూర్యని లేపి ఫుల్లుగా క్లాస్ పీకారు నాగ్. ఆరోహి మీద కోపమొస్తే అన్నం పారేయడమేంటి, అది లేక ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు, అందరూ ఆకలితో ఉంటే నువ్విలా చేయడం కరెక్టా అంటూ కాస్త గట్టిగానే ఇచ్చారు. ఆరోహి తినకుండా పక్కకి వెళ్లిపోవడం కూడా తప్పే, దానికి నువ్వు పడేయడం ఇంకో తప్పు అంటూ తిట్టారు. పనిష్మెంట్ ఏమిటని కొత్త కెప్టెన్ కీర్తిని అడిగితే.. ఒక రోజంతా ఆరోహితో మాట్లాడకూడదని చెప్పింది. అది నాగ్ ఒప్పుకున్నారు. ఆమె సైగలు చేయకుండా, మాట్లాడుకుండా చూసే బాధ్యత పాత కెప్టెన్ ఆదికి అప్పగించారు. వయసు గురించి మాట్లాడినందుకు శ్రీహాన్‌కి కూడా గట్టిగానే మొట్టికాయలు వేశారు. తను హర్ట్ అయిందని తెలిశాక కూడా ఆర్గ్యూ చేస్తూనే ఉన్నావు అన్నారు. ఒక చిన్న మాటకి నువ్వు బాడీ షేమింగ్ చేశాడంటూ ఎలా మాట్లాడతావని ఇనయా మీద కోప్పడ్డారు. నువ్వు బాగుంటావు, నీ కాంప్లెక్స్ తీసి బయటపెట్టెయ్ అన్నారు. మా నాన్నగారి వాయిస్‌ని కూడా వీక్‌ అన్నారు, ఆయన దాన్ని అడ్వాంటేజ్‌గా చేసుకున్నారు, బలహీనతల్ని అధిగమించాలి అని మోటివేట్ చేశారు. అందరికంటే చంటి పెద్దోడని అనుకుంటున్నారు కానీ శ్రీహానే అందరి కంటే పెద్దోడని చెప్పి కాసేపు నవ్వించారు. 

శ్రీసత్య బెస్ట్.. వాళ్లందరూ వరస్ట్‌

బాలాదిత్య ఆటతీరును ఈవారం కూడా నాగ్ తప్పుబట్టారు. అతను ఆడిన విధానం అస్సలు బాలేదంటూ జీరో పాయింట్స్ ఇచ్చారు. అతనికి కోపం రావడాన్ని మాత్రం హైలైట్ చేసి మాట్లాడారు. నవ్వారు. ఆ తర్వాత గీతూ ఏడవడం గురించి కూడా ఆయన మాట్లాడారు. గీతూని ఎందుకు మోసం చేశావు, నిన్ను మాత్రమే తను ఫ్యామిలీ మెంబర్‌‌లా ఫీలవుతుంది అని చెప్పారు. తనని క్షమించమని గీతూకి చెప్పినా నో అంది. కస్టమర్ అయ్యుండి హోటల్‌లో నువ్వు టిప్స్ తీసుకోవడం ఏంటి అంటూ రాజ్‌ని ప్రశ్నించారు. బాగా ఆడుతున్నావు కానీ ఇంకొంచె ఇంప్రూవ్ చేసుకో, చాలా బెటర్ అయ్యావంటూ సుదీపని మెచ్చుకున్నారు. రోహిత్, మెరీనాల్ని ఇంకా బాగా ఆడాలని అన్నారు. చంటి అసలు ఆటే ఆడలేదంటూ తప్పుబట్టారు. ఇనయా ఆట కూడా అంత బాలేదని తేల్చేశారు. సూర్య, ఆరోహిలు కొంతవరకే బాగా ఆడారని చెప్పారు. రేవంత్‌ని మాత్రం చాలా బాగా ఆడాడని మెచ్చుకున్నారు. అతనిని సీమంతం కూడా చేస్తామన్నారు. శ్రీసత్య ఆట కూడా సూపర్ అన్నారు. వీళ్లిద్దరికీ వెయ్యేసి రూపాయల చొప్పున టిప్ ఇచ్చారు. ఫైమాని కూడా మెచ్చుకున్నారు. అర్జున్ కళ్యాణ్‌ ఆట తీరుని ఫైమా తప్పుబడితే అది అతని స్టైల్, తను ఎవరికి కావాలంటే వాళ్లకి ఇచ్చుకుంటాడు, అందులో తప్పేం లేదన్నారు. కీర్తికి కెప్టెన్ అయినందుకు విషెస్ చెప్పారు. కానీ క్యాబరే డ్యాన్సర్ అనే పదాన్ని వాడటం కరెక్ట్ కాదన్నారు. అందుకు టిప్‌లో కొంత కట్ చేసేస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత బ్రేక్ ఇవ్వడంతో ఆ గ్యాప్‌లో కీర్తి ఏడ్చేసింది. అందరినీ మెచ్చుకుంటారు, నేనింత కష్టపడితే అప్రిషియేట్ చేస్తూ ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ నెత్తి మీద నీళ్ల కుండకి కన్నం పెట్టింది. అది చూసిన నాగ్ ఏమయ్యింది నీకు అని అడిగారు. నేను నువ్వింకా బాగా చేయగలవని ఊహిస్తున్నాను, అలా చేసినరోజున నువ్వు అడగక్కర్లేదు, నేనే మెచ్చుకుంటాను అని చెప్పారు.  

చంటీ.. ఇలా అయ్యిందేంటి!

చంటి ఆటలో ఎంత డల్‌గా ఉన్నాడో చూస్తూనే ఉంటాం. ప్రతిసారీ ఏదో ఒక స్టోరీ చెప్పి తప్పించుకుంటాడు. వీకెండ్‌లో నాగ్ అడిగితే ఇక్కడి నుంచి నేనేంటో చూపిస్తా అంటాడు. ఈవారం కూడా అదే పాట పాడాడు. అయితే అతనికి మామూలు షాక్ తగల్లేదు. ఆట బాగా ఆడలేదంటూ నాగ్‌ జీరో పాయింట్స్ ఇచ్చినవాళ్లు నలుగురు మిగిలారు. అందులో ఎవరు బాగా వీక్ అనేది చెప్పమన్నారు. ఎక్కువ ఓట్లు వచ్చినవాళ్లు ఈ సీజన్ మొత్తం కెప్టెన్ అవ్వడానికి అనర్హులని చెప్పారు. మిగతా వారికి తక్కువ ఓట్లు పడ్డాయి. ఇనయాకి, చంటికి సమానంగా ఓట్లు పడ్డాయి. వాళ్లలో ఒకరి పేరు చెప్పమని కెప్టెన్‌ని అడిగారు నాగ్. ఆమె చంటి పేరు చెప్పింది. నేను ఏం చేసినా కెమెరాల కోసం చేస్తానని అన్నాడు, అది నాకు నచ్చలేదు అని చెప్పింది. దాంతో హౌస్‌లో ఉన్నంత వరకు నువ్వు కెప్టెన్‌వి కాలేవని కన్‌ఫర్మ్ చేసి చెప్పేశారు నాగ్. అయితే ఈ రీజన్‌ గురించి తర్వాత చంటి చాలాసేపు జుట్టు పీక్కున్నాడు. నేను అనడం నువ్వు విన్నావా అంటూ అందరినీ అడిగాడు. చివరికి నేనిలా అన్నానని నీకెవరు చెప్పారు, ఎవరో చెబితే నమ్మేస్తావా అని కీర్తిని కూడా అడిగాడు. మీరు అలా అనలేదని ప్రూవ్ చేస్తే ఈ సీజన్ మొత్తం నేను కెప్టెన్ అవ్వనని మాటిస్తున్నాను అంది. మొత్తానికి బోరింగ్‌ సాగుతున్న సీజన్‌ని ఇంటరెస్టింగ్‌గా మార్చేందుకే ఇలాంటి ట్విస్టులు ప్లాన్ చేశారనిపిస్తోంది.

ఈ చాట్.. చాలా హాట్

ఇవాళ బిగ్‌బాస్ హౌస్‌లో చాట్ భాండార్ తెరిచారు నాగ్. ఓ టేబుల్ మీద పానీ పూరీలు పెట్టారు. కొన్ని పదార్థాలు కూడా పెట్టారు. వ్యక్తిత్వం లేదు అనడానికి ప్రతీకగా నీళ్లు, టాక్సిక్ అని చెప్పడానికి కాకరకాయ రసం, బద్దకస్తులకు ఆలూ, చాలా కంట్రోల్‌లో ఉండాలి అనేవారికి ఉప్పు, రూడ్‌గా ఉండేవాళ్లకి చిల్లీ సాస్, ఏడిపించిన వారికి ఆనియన్స్ అంటూ రకరకాల పదార్థాలు పెట్టారు. మీరు ఎవరికి ఏ ట్యాగ్ ఇవ్వాలనుకుంటే వారికి పూరిలో ఆ పదార్థాన్ని వేసి ఇవ్వాలి. చాలామంది గీతూని బద్దకస్తురాలిగా తేల్చారు. ఆమె చాలా రూడ్ అని ఒకరు, కంట్రోల్‌లో ఉండాలని ఇంకొకరు పానీ పూరీ తినిపించారు. శ్రీసత్యని కూడా బద్దకస్తురాలన్నారు. శ్రీహాన్ టాక్సిక్ అని ఇనయా అంటే, చంటి మోస్ట్ టాక్సిక్, కన్నింగ్ అని గీతూ తేల్చింది. ఆదిరెడ్డిని రాజ్ సోమరిపోతు అన్నాడు. బాలాదిత్య తనని ఏడిపించాడంటూ ఉల్లిపాయ పూరీ పెట్టింది ఫైమా. రేవంత్ తనని బాగా ఏడిపస్తున్నాడని శ్రీహాన్‌ అంటే.. ఆరోహి రూడ్ అంటూ శ్రీసత్య చెప్పింది. ఇక్కడ కూడా సూర్య కాస్త అతి తెలివిని ప్రదర్శించాడు. పూరీలో నీళ్లు వేసి బాలాదిత్యకి పెట్టాడు. అదేంటి, అంటే అతను వ్యక్తిత్వం లేనివాడనా అని నాగ్ అంటే.. నేను దీన్ని పాజిటివ్‌ వేలో ఇచ్చాను అని ఏదో సోది చెప్పబోయాడు. దాన్ని నాగ్ యాక్సెప్ట్ చేయలేదు. 

మొత్తానికి కొన్ని క్లాసులతో, కొంచెం హెవీ డోసులతో వీకెండ్ ఎపిసోడ్ ఇంటరెస్టింగ్‌గానే సాగింది. సూర్య అస్తమానం తలచుకుని ఏడుస్తున్న బుజ్జమ్మ గురించి, ఆరోహిని నందు గురించి అడిగి ఇరుకున పెట్టారు నాగ్. తమ రిలేషన్స్ గురించి మాట్లాడిన ఆరోహి.. ఇప్పటికైనా మా విషయంలో అందరికీ క్లారిటీ వస్తుంది అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే రేపు ఆరోహి పైనే వేటు పడబోతోందంటూ గట్టిగా వినిపిస్తోంది. నిజానికి వాసంతి కానీ, అర్జున్ కళ్యాణ్ కానీ అవుటవుతారనే ప్రచారం గట్టిగా జరిగింది. అంతలోనే ఆరోహిని పంపిస్తున్నారనే గుసగుసలు మొదలయ్యాయి. దానికి కారణం కూడా ఉందట. సూర్య విషయంలో ఆమె ప్రవర్తన తప్పుగా వెళ్తోందని, ఆమె వల్లే సూర్య సరిగ్గా ఆడలేకపోతున్నాడనే కామెంట్స్ బలంగా వస్తున్నాయి. దీన్ని సరి చేసేందుకు, బిగ్‌బాస్‌లో అశ్లీలత ఉంది అంటూ కేసులు వేసినవారికి, కోర్టుకి అలాంటిదేమీ లేదని ప్రూవ్ చేసేందుకే నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో, ఎవరికి వేటు పడుతుందో చూడాలి. ఇంకో విషయమేమిటంటే.. రేపు విజయదశమి స్పెషల్ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. సో ఆట, నాగ్ వేట ఆరింటికే మొదలైపోతుంది.