అమెరికాలో మరింత విస్తరిస్తున్న కార్చిచ్చు

అమెరికాలో మరింత విస్తరిస్తున్న కార్చిచ్చు
  • తూర్పు వాషింగ్టన్​లోకి ప్రవేశించిన మంటలు
  • దావాగ్నిని ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్న సిబ్బంది

న్యూయార్క్: అమెరికాను వణికిస్తున్న కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. దావాగ్ని శుక్రవారం తూర్పు వాషింగ్టన్, కెనడా ప్రావిన్స్  బ్రిటిష్  కొలంబియాలోకి ప్రవేశించింది. దీంతో అధికారులు స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను నియంత్రించేందుకు రెస్క్యూ ఫైటర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాషింగ్టన్ లోని నైరుతిలో ఉన్న స్పోకేన్  కౌంటీకి దగ్గర్లో ప్రారంభమైన కార్చిచ్చు కొన్ని గంటలలోనే మూడువేల ఎకరాలను బుగ్గి చేసింది. ఈస్టర్న్  వాషింగ్టన్  స్టేట్, నార్తర్న్  ఇదాహో స్టేట్లకు శనివారం ‘రెడ్  ఫ్లాగ్  వార్నింగ్’ జారీ చేశారు. కార్చిచ్చు వల్ల స్పోకేన్  కౌంటీలో ఒక వ్యక్తి చనిపోయాడని అధికారులు తెలిపారు. కౌంటీలోని మెడికల్  లేక్  సిటీలో పలు ఇండ్లు, బిల్డింగులు కాలిపోయాయని తెలిపారు. గంటకు 35 మైళ్ల వేగంతో గాలులు వీయడంతో దావాగ్ని మరింత భీకరంగా వ్యాపించిందని, దీనికితోడు ఎండుగడ్డి కూడా ఉండడంతో కార్చిచ్చు చాలా వేగంగా దూసుకొచ్చిందని చెప్పారు. మెడికల్  లేక్  పౌరులందరూ వెంటనే నగరాన్ని ఖాళీ చేయాలని సిటీ మేయర్  టెర్రీ కూపర్  ఫేస్ బుక్​లో హెచ్చరించారు. మంటలను అడ్డుకోవడానికి లేదా దారి మళ్లించడానికి ఫైర్  ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో మంటలపై నీళ్లు చల్లుతున్నారు. అయినా 
మంటలు అదుపులోకి రావడం లేదు. 

కెనడాలోనూ ప్రవేశించిన దావానలం

కెనడాలో కూడా కార్చిచ్చు ప్రవేశించింది. ఇక్కడ బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్​లోని ప్రముఖ రిస్టార్ట్  కెలోవ్నాలో పలు ఇండ్లను బూడిద చేసింది.