క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల అప్పులు తీర్చడానికి సొంత ఇంట్లోనే చోరీ నాటకం

క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల అప్పులు తీర్చడానికి సొంత ఇంట్లోనే చోరీ నాటకం

ముషీరాబాద్, వెలుగు: తన ఇంట్లోనే దొంగతనం చేసి తప్పుడు ఫిర్యాదు చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్, ఇన్​స్పెక్టర్ ఎం. మల్లేశం వివరాల ప్రకారం.. చిక్కడపల్లి అలేఖ్య ఎస్టేట్లో నివాసం ఉంటున్న భాస్కర్ ప్రమోద్ (32) బీటెక్ పూర్తి చేసి అమెరికా వెళ్లి మధ్యలోనే తిరిగొచ్చేశాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ద్వారా అప్పులు చేశాడు.

అప్పులు తీర్చడానికి 2024 నుంచి తన రూమ్లో ఉన్న నానమ్మ, కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ. 4.60 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఇటీవల అతని అన్నయ్య పెండ్లి ఖాయం కావడంతో నానమ్మ బంగారాన్ని పెండ్లి ఖర్చుల కోసం తీయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో భయాందోళనకు గురైన భాస్కర్ ప్రమోద్ తన దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ప్లాన్ వేశాడు.

ఫిబ్రవరి 9న తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు సీన్ క్రియేట్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఎత్తుకెళ్లారని తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. దర్యాప్తు చేసిన చిక్కడపల్లి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి ఫిర్యాదుదారుడే అసలు నిందితుడని తేల్చారు. విచారణలో నిందితుడు కొన్ని వెండి వస్తువులను మూసీ నాలాలో పడేసినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి సుమారు మూడు తులాల రెండు బంగారు ఉంగరాలు, ఒక వెండి ప్లేటు, గిన్నెలు, మూడు గోల్డ్ లోన్ మార్టిగేజ్ స్లిప్పులు, ముత్తూట్ ఫైనాన్స్​లో ఉంచిన 80 గ్రాముల బంగారం పత్రాలు రికవరీ చేశారు.