
10 తులాల బంగారం, రూ.2.88 లక్షలు చోరీ చేసిన రౌడీషీటర్
ఆదిభట్ల (హైదరాబాద్), వెలుగు: భార్య మీద కోపంతో సొంతింట్లోనే దొంగతనం చేశాడో రౌడీషీటర్. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారని చెప్పే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాద్‌లోని ఆదిభట్ల పరిధిలో జరిగిందీ ఘటన. వివరాలను మంగళవారం ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ వెల్లడించారు. ఓల్డ్‌సిటీకి చెందిన వెలుపు ఎడ్విన్ మోసెస్ (48) అనే వ్యక్తి భార్య రాణితో కలిసి నాదర్గుల్లోని అంబేద్కర్ కాలనీలో ఉంటున్నాడు. సిటీలోకి షిఫ్ట్ అయ్యేందుకు భార్యతో చర్చించాడు. అయితే, ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. కోపం పెంచుకున్న మోసెస్, ఆమెను సిటీలోకి మార్పించాలన్న ఉద్దేశంతో చోరీకి కుట్ర పన్నాడు. ఈ నెల 5న భార్యను ఓ ఫంక్షన్‌కు పంపాడు.
తర్వాత తన కారు డ్రైవర్ బోడ నవీన్ (20)తో కలిసి ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లాడు. బీరువా పగులగొట్టి 10 తులాల బంగారు నగలు, రూ.2.88 లక్షలు దోచేశాడు. తర్వాత దొంగలు పడ్డారని భార్యను నమ్మించేందుకు తానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. భార్యతో కలిసి వెళ్లి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆదిభట్ల పోలీసులు నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ కాలేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఎడ్విన్ మోసెస్ స్కూటీనీ ఆపారు. అతడి వద్ద రెండు కత్తులుండడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో అతడిపై 14 కేసులున్నట్టు గుర్తించారు. విచారణలో బోడ నవీన్‌తో తానే తన ఇంట్లో దొంగతనం చేయించానని ఒప్పుకున్నాడు. మోసెస్, నవీన్‌ను అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన నగలను, డబ్బును స్వాధీనం చేసుకున్నారు.