పీసీసీ రేసులో 150 మంది ఉన్నరు

పీసీసీ రేసులో 150 మంది ఉన్నరు

అందరితో మాట్లాడి నిర్ణయిస్తం: మాణిక్కం ఠాగూర్

రాష్ట్ర పీసీసీ చీఫ్​ రేసులో 150 మంది లీడర్లు ఉన్నారని.. వారందరితోనూ మాట్లాడి సోనియాగాంధీకి రిపోర్టు ఇస్తానని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్​ చెప్పారు. పోటీపడుతున్న వారిలో కేంద్ర మాజీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్లు చాలా మంది రేసులో ఉన్నారని తెలిపారు. ఈ మొత్తం ప్రాసెస్‌‌కు కొంత టైమ్‌‌ పడుతుందని పేర్కొన్నారు. బుధవారం గాంధీభవన్‌‌లో ఉత్తమ్‌‌, భట్టిలతో కలిసి మాణిక్కం ఠాగూర్​ మీడియాతో మాట్లాడారు. కొత్త పీసీసీ చీఫ్​ వచ్చే వరకు ఉత్తమ్‌‌  పదవిలో కొనసాగుతారని.. 2023 ఎన్నికలకు కొత్త పీసీసీ చీఫ్​తోనే వెళ్తామని తెలిపారు.

తాను మూడు రోజులపాటు హైదరాబాద్‌‌లోనే ఉంటానని.. ఆశావహులందరినీ పిలిచి, ఒక్కొక్కరితో మాట్లాడి అభిప్రాయం తీసుకుంటానని చెప్పారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో కాంగ్రెస్​ తమ శక్తినంతా ఉపయోగించి పోరాటం చేసిందని.. గెలుపోటములను సమీక్షించుకుంటామని వివరించారు. సమస్యలను అధిగమించి, త్వరలోనే  సమర్థవంతమైన పార్టీగా కాంగ్రెస్‌‌  తిరిగి రూపుదిద్దుకుంటుందన్నారు. కాంగ్రెస్‌‌ క్రికెట్‌‌ టీమ్‌‌లాంటిదని.. మొదట్లో ఓడినా ఇండియా టీమ్‌‌లాగా అంతిమ గెలుపు తమదేనని కామెంట్​ చేశారు. ఉత్తమ్‌‌ ఇప్పటిదాకా పార్టీని సమర్థవంతంగా నడిపారని.. కొత్త చీఫ్​ ఎంపికపై తుది నిర్ణయం సోనియాగాంధీ చేతిలో ఉంటుందని​చెప్పారు.