మన ‘చదువు’ సక్కగ లేదు!

మన ‘చదువు’ సక్కగ లేదు!
  • స్కూల్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో రాష్ట్రం వెనకబాటు 

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో గవర్నమెంట్‌ స్కూళ్లు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా వెనకబడ్డాయి.  డిజిటల్, ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌లో రాష్ట్రం ఏబీసీడీలను కూడా దాటలేదు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ను పరిశీలిస్తే రాష్ట్రంలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కు సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యాయి. – ఒక్క టీచర్‌ మాత్రమే ఉన్న స్కూళ్లు తెలంగాణలో 2015-–-16లో11.8 శాతం ఉండగా, 2016––17లో వాటి సంఖ్య12.6 శాతానికి పెరిగినట్లు రిపోర్ట్ పేర్కొంది. ఇంకా అనేక అంశాల్లోనూ పెద్దగా పురోగతి లేదని ‘స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్’లోని పలు అంశాలను చూస్తే తెలుస్తోంది.

వీటిలో జీరో ఫర్ఫామెన్స్..

-ప్రత్యేక అవసరాలున్న ప్రతి బిడ్డకు ఉపకరణాలు అందజేయాలని రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ చెబుతోంది. సర్వశిక్ష అభియాన్‌, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ కింద ఇందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. అయితే ఈ ఉపకరణాలను జార్ఖండ్‌, కర్నాటక, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాలు వంద శాతం అందించాయని నీతి ఆయోగ్ రిపోర్ట్ పేర్కొంది. కేరళ, ఏపీ రాష్ట్రాలు 98 శాతం అందజేయగా తెలంగాణలో ఈ పర్సంటేజీ 2015-–16 అకడమిక్ ఇయర్ తో పాటు 2016-–17లోనూ జీరోగా నమోదైంది. అలాగే నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌ఐఈపీఏ) సంస్థ  నేషనల్ ప్రోగ్రాం ఆన్ స్కూల్ స్టాండర్డ్స్ అండ్ ఎవాల్యుయేషన్ కింద దేశంలోని అన్ని స్కూళ్లల్లో ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి స్కూల్‌ హెచ్‌ఎం సెల్ఫ్‌ ఎవాల్యూయేషన్‌ రిపోర్ట్‌ పంపాల్సి ఉంటుంది. అత్యధికంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో 84.6 శాతం స్కూళ్లు సెల్ఫ్‌ ఎవాల్యూయేషన్‌ చేయగా, తెలంగాణలో 0.1 శాతం స్కూళ్లు మాత్రమే సెల్ఫ్‌ ఎవాల్యూయేషన్‌ చేశాయి.

టాప్ రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ పరిస్థితి ఇలా..  

  •     ఎలిమెంటరీలో కంప్యూటర్‌ ఎయిడెడ్‌ లెర్నింగ్‌ (సీఏఎల్‌) ఉన్న స్కూళ్లు: గుజరాత్– 58.3%, కేరళ– 49.6%.. తెలంగాణ–5.2%.
  •     సెకండరీ స్కూల్‌ స్థాయిలో కంప్యూటర్‌ ల్యాబ్‌ సౌకర్యం ఉన్న స్కూళ్లు: తమిళనాడు– 67%, తెలంగాణ–11.8%
  •     ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్న స్కూళ్లు: హిమాచల్‌ ప్రదేశ్‌– 20%..  తెలంగాణ– 0
  •     ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఉపకరణాల అందజేత: ఏపీ, కేరళ, తదితర రాష్ట్రాలు– 98%.. తెలంగాణ 0
  •     టీచర్ల ఆధార్ సీడింగ్, ఎలక్ట్రానిక్ డేటా బేస్ నమోదు: ఏపీ, ఎంపీ, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు–100%, తెలంగాణ–49%.
  •     హెడ్‌మాస్టర్లు/ప్రిన్సిపాళ్లు ఉన్న స్కూళ్లు: గుజరాత్‌–87.1%, తెలంగాణ–35.3%.
  •     ఎస్‌ఈఆర్‌టీలో అకడమిక్ పోస్టుల భర్తీ: హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌, పంజాబ్‌–100%.. తెలంగాణ– 88.5%.