వెల్‌‌‌‌‌‌‌‌నెస్ సెంటర్లలో మందుల్లేవ్

వెల్‌‌‌‌‌‌‌‌నెస్ సెంటర్లలో మందుల్లేవ్
  • రెండు నెలలుగా ఇదే దుస్థితి 
  • డాక్టర్లు రాసే దాంట్లో సగం కూడా దొర్కుతలేవ్ 
  • డబ్బులు పెట్టి బయట కొనుక్కుంటున్న పేషెంట్లు

హైదరాబాద్, వెలుగు: ఎంప్లాయీస్, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్లలో మందులు అందుబాటులో ఉండడం లేదు. బీపీ, షుగర్, థైరాయిడ్ గోలీలూ దొర్కుతలేవు. గత రెండు నెలలుగా ఇదే దుస్థితి నెలకొంది. దూరప్రాంతాల నుంచి వస్తున్న పేషెంట్లు.. డాక్టర్ కు చూపించుకొని మెడిసిన్స్ కోసం ఫార్మసీకి వెళ్తే లేవని పంపేస్తున్నారు. డాక్టర్లు రాసే దాంట్లో సగం మందులు కూడా దొరకడం లేదని, ఒక్కటి ఉంటే మరొకటి ఉండడం లేదని పేషెంట్లు వాపోతున్నారు. కొన్ని ఖరీదైన మందులైతే అసలు రావడం లేదంటున్నారు. లాక్​ డౌన్​కు ముందు​ కొన్ని మందులైనా అందుబాటులో ఉండేవని, ఇప్పుడైతే పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్, వనస్థలిపురం, కూకట్​పల్లిలో వెల్​నెస్ సెంటర్లు ఉన్నాయి. ఖైరతాబాద్​కు రోజూ 400 నుంచి 600 మంది, వనస్థలిపురానికి 300 నుంచి 400 మంది, కూకట్​పల్లికి 200 నుంచి 250 మంది వరకు వస్తుంటారు. ఖైరతాబాద్ హెడ్ సెంటర్​గా కొనసాగుతుండటంతో, ఇక్కడికే ఎక్కువ మంది వస్తున్నారు.  
బీపీ, షుగర్ బాధితులే ఎక్కువ... 
వెల్​నెస్ సెంటర్లకు వచ్చే వారిలో బీపీ, షుగర్, థైరాయిడ్ బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. షుగర్ బాధితుల్లో దాదాపు 70 శాతం మందికి ఇన్సులిన్ అవసరం ఉంటుంది. దీని ధర ​మార్కెట్​లో రూ.200 నుంచి రూ.2,000 వరకు ఉంది. ప్రస్తుతం ఖైరతాబాద్, కూకట్ పల్లి సెంటర్లలో ఇన్సులిన్స్ అందుబాటులో లేదు. దీంతో పేషెంట్లు వచ్చి తిరిగి వెళ్తున్నారు. డాక్టర్లు రాసే మందులు వెల్ నెస్ సెంటర్లలో దొరక్క, నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు పెట్టి బయట కొనుక్కుంటున్నామని పలువురు పేషెంట్లు వాపోయారు. 
ఆర్డర్ ఇచ్చాం: నోడల్ ఆఫీసర్ 
వెల్​నెస్​ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బంది సరిపడా ఉన్నప్పటికీ మందులు మాత్రం అందుబాటులో ఉండడం లేదు. రోజూ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెంటర్లు ఓపెన్ ఉంటున్నాయి. నగరంలో మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామన్న సర్కార్.. ఆ విషయాన్నే మరిచిపోయింది. కాగా, అన్ని రకాల మందులు ఆర్డర్​ చేశామని, కొద్ది రోజుల్లోనే మెడిసిన్స్ వస్తాయని.. పేషెంట్స్​ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నోడల్​ఆఫీసర్ ​విజయ్ చెప్పారు.
మెడిసిన్స్ లేవంటున్రు..
వెల్ నెస్ సెంటర్లలో మందులు ఉండడం లేదు. సెలవులు పెట్టి మరీ, దూర ప్రాంతాల నుంచి వస్తే మెడిసిన్స్ ​లేవని తిప్పి పంపుతున్నారు. మందుల కొరత లేకుండా చూడాలి. అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలి. -వీరయ్య, ఉద్యోగి భర్త