మందుల్లేకనే పేషెంట్లను బయటికి పంపుతున్నం

మందుల్లేకనే పేషెంట్లను బయటికి పంపుతున్నం
  • అధికారులకు చెప్పినా.. పట్టించుకోవట్లే
  • రూల్స్ ముఖ్యమా ? పేషెంట్ ప్రాణమా ?
  • తెలంగాణ జూనియర్ డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా సర్కార్​ దవాఖాన్లలో మందుల కొరత ఉందని జూనియర్​ డాక్టర్లు ఆరోపించారు. ఇక్కడ మందులు లేకపోవడంతోనే బయట తీసుకోమని ప్రిస్కిప్షన్ రాస్తున్నామని, దీనికి సస్పెండ్ చేస్తామనడం సరికాదన్నారు. మంగళవారం కోఠిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్​లో తెలంగాణ జూడాల అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్కార్​ హాస్పిటల్స్ –  ఎమర్జెన్సీ అండ్ ఎస్సెన్షియల్​ మెడిసిన్స్ సప్లై మీద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డా. ప్రతిభ మాట్లాడారు. ప్రభుత్వ డాక్టర్లు వందశాతం పనిచేస్తున్నారని, సౌకర్యాలు, సిబ్బంది పెరగలేదు కానీ పనిఒత్తిడి పదిరెట్లు పెరిగిందని విమర్శించారు. అయినా తాము పని చేస్తూనే ఉన్నామని చెప్పారు. హాస్పిటల్స్​లో మందులు లేకపోతే.. బయట తీసుకోవాలని చెబుతున్నామన్నారు. సర్కార్​కు.. రూల్స్​ ముఖ్యమా..? రోగి ప్రాణాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. సమయానికి మందులిస్తే రోగి ప్రాణం నిలబడుతుందనే ఉద్దేశంతోనే రాస్తున్నామన్నారు. బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవాళ్లకి మాత్రమే ఇలా బయట మెడిసిన్స్ రాస్తే కమీషన్​ వస్తుందని, కానీ తాము అలా చేయడం లేదని చెప్పారు. తమపై సర్కార్​నిందలు వేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మందులు అందుబాటులో ఉండి కూడా బయటకు రాస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర మెడిసిన్స్​ గురించి సూపరింటెండెంట్​కు చెప్పామని, అయినా పట్టించుకోలేదన్నారు. జూనియర్​ డాక్టర్​ బొంగు రమేష్ మాట్లాడుతూ... ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రిన్సిపల్ అనుమతివ్వలేదని చెప్పారు. సంస్కరణలు తీసుకొస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారని, వారు చేసే పనులకు తాము సహకరిస్తామన్నారు. పెట్లబుర్జు సూపరింటెండెంట్ ని రెండు నెలలైనా ఇంకా ఎందుకు రిలీవ్ చేయలేదని ప్రశ్నించారు. డాక్టర్లను అడ్మినిస్ట్రేటర్లు  ఇబ్బంది పెడుతున్నారని,  వారిని ఎందుకు రిలీవ్ చేయడంలేదన్నారు. ఈ సమావేశంలో జూడా జనరల్ సెక్రటరీ డా. వన్య, జూడా అడ్వైజర్ డా. రాజీవ్, మాజీ జూడా ప్రెసిడెంట్ డా. విష్ణు, జూడా మాజీ సెక్రటరీ డా. శ్రీకాంత్, ఐఎంఈ తెలంగాణా ప్రెసిడెంట్ డా. సంపత్ పాల్గొన్నారు.