కొత్త పెన్షన్లు ఇప్పట్లో లేనట్లే?

కొత్త పెన్షన్లు ఇప్పట్లో లేనట్లే?
  • ప్రస్తుత లబ్ధిదారులకే బడ్జెట్​కేటాయింపులు?
  • ‘ఆసరా’కు రూ.9,402 కోట్లు
  • ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​తోపోలిస్తే రూ.2,663 కోట్ల కోత
  • కొత్తోళ్లకు  ఎప్పడిస్తారో నో క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: కొత్త ఆసరా పెన్షన్లు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. తాజా బడ్జెట్ కేటాయింపులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓటాన్ అకౌంట్​బడ్జెట్​తో పోలిస్తే ఈసారి భారీ కోత పడింది. దీంతో కొత్త పెన్షన్లు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. వయసు తగ్గింపు వల్ల కొత్తగా ఎంపికయ్యే వారికి త్వరలో పెన్షన్ ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అసలు ఎంపిక ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పటి నుంచి పెన్షన్ ఇస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.

రూ.9,402 కోట్లే..

ఆసరా పెన్షన్ల కింద రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మందికి రూ.5,500 కోట్లు ఖర్చయ్యేవి. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్ల సొమ్మును పెంచారు. అర్హత వయసును 62 నుంచి 57 ఏళ్లకు తగ్గించారు. దీంతో కొత్తగా సుమారు 7 లక్షల మంది యాడ్ అవుతారని అంచనా.  మొత్తంగా ఆసరా పెన్షన్లకు వ్యయం రూ.12 వేల కోట్లు దాటుతుందని తేల్చారు. ఈ మేరకు ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రభుత్వం రూ.12,065 కోట్లు కేటాయించింది. కానీ తాజాగా రూ.9,402 కోట్లు మాత్రమే కేటాయించింది. గతంతో పోలిస్తే ఈ సారి రూ.2,663 కోట్ల కోత విధించింది. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొత్త లబ్ధిదారుల ఎంపిక అన్ని జిల్లాల్లో పూర్తయినా జీహెచ్ఎంసీలో పూర్తి కాలేదు. ఎప్పుడవుతుందనే దానిపైనా స్పష్టతలేదు.

మరో నెల పెండింగ్

ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవటంతో రెండు నెలల పెన్షన్ పెండింగ్ లో ఉండిపోయింది. అయితే నాలుగు రోజుల కిందట ఒక నెల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరింది. ఈనెల 20 లోపు మరో నెల పెన్షన్ కూడా ఇవ్వాల్సి ఉంది. ఆసరా పెన్షన్ల కోసం ప్రతి నెల సుమారు రూ.837 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈనెలలో రాష్ట్రవ్యాప్తంగా 39,41,976 మంది పెన్షన్ అందుకున్నారు.