వెరైటీ వ్యాక్సిన్​ సెంటర్స్​ ఇవే..

వెరైటీ వ్యాక్సిన్​ సెంటర్స్​ ఇవే..

ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్​ డ్రైవ్​ నడుస్తోంది. అయితే, హాస్పిటల్స్​, పీహెచ్​సీలకు వెళ్లి వ్యాక్సిన్​ వేసుకోమంటే హాస్పిటల్ వాతావరణం, వ్యాక్సిన్​ మీద ఉన్న భయాలతో చాలామంది ఇంట్రెస్ట్​ చూపిస్తలేరు. అందుకే కొన్ని దేశాలు జనం వద్దకే వ్యాక్సిన్​ సెంటర్స్​ను తీసుకొచ్చాయి. టిక్​టాక్​ స్టూడియో, సినిమాహాల్​, షాపింగ్​ మాల్​, ఆర్టీసీ బస్సులు, గుళ్ళు, గోపురాలు..  వీటిని టెంపరరీగా వ్యాక్సిన్​ సెంటర్స్​ చేశాయి. ‘వ్యాక్సిన్​  మాకు వద్దంటే వద్ద’ని మొండికేసే వాళ్లను కూడా మోటివేట్​ చేసేలా ఉన్న ఈ వ్యాక్సిన్​ సెంటర్లపై ఓ లుక్కేద్దాం...

సినిమా హాల్స్​

ఫిలిప్పీన్స్​లో మార్చి నుంచే కరోనా వ్యాక్సిన్​ వేస్తున్నారు. అయితే,  ప్రజలు వ్యాక్సిన్​ వేసుకునేందుకు ముందుకు రావట్లేదు. దాంతో  ఆ దేశ ప్రెసిడెంట్​ రోడ్రిగో దుతెర్తె ‘కరోనా వ్యాక్సిన్​ వేసుకుంటారా.. జైల్లో పెట్టమంటరా.. ఈ రెండింటిలో ఏది కావాలో డిసైడ్​ అవ్వండి’ అని వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్ని వ్యాక్సిన్​ డ్రైవ్​వైపు నడిపించేందుకు హెల్త్​ ఆఫీసర్స్​ ఒక సినిమా థియేటర్​ను  కరోనా వ్యాక్సిన్​ కేంద్రంగా మార్చారు. ఇప్పుడు అక్కడి జనం సరదాగా సినిమా హాల్​కు వెళ్లి, టికెట్ కౌంటర్లలో పేరు రిజిస్టర్​ చేసుకొని, వ్యాక్సిన్​ వేసుకుంటున్నారు. 

షాపింగ్​ మాల్స్​

బ్యాంకాక్​లో షాపింగ్​ మాల్స్​లో వ్యాక్సిన్​ వేస్తున్నారు. హాస్పిటల్స్​ దగ్గర్లో ఉన్న షాపింగ్​మాల్స్​ను కరోనా వ్యాక్సిన్​ సెంటర్స్​ చేయడంతో ప్రజలు ఏ భయం లేకుండా వస్తున్నారు. దాదాపు 12కుపైగా షాపింగ్​ మాల్స్​  టెంపరరీగా వ్యాక్సిన్​ సెంటర్లుగా మారాయి.  మెక్సికోలో అయితే బస్సులో కూర్చొంటే చాలు. హెల్త్​ వర్కర్లు వచ్చి వ్యాక్సిన్​ వేస్తారు. అలాగే  జపాన్​లో సాకర్​ క్లబ్స్​, లండన్​లో ఫుట్​బాల్​ స్టేడియం ... ఇప్పుడు మాస్​ వ్యాక్సిన్​ డ్రైవ్​ సెంటర్లుగా మారాయి. ఈ వెరైటీ వ్యాక్సిన్​ సెంటర్లు ప్రజల్లో భయాన్ని పోగొడుతూనే, తక్కువ టైంలోనే మాస్​ వ్యాక్సినేషన్​ పూర్తయ్యేందుకు పనికొస్తున్నాయి.