వెలుగు ఓపెన్ పేజీ : వంటింటికి వార్ దెబ్బ!

వెలుగు ఓపెన్ పేజీ : వంటింటికి వార్ దెబ్బ!

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం  వంటింటిపై  పడింది.   యుద్ధ ప్రభావ తీవ్రత పరాకాష్టకు చేరింది.  దేశవ్యాప్తంగా వంట గ్యాస్​కు  తీవ్ర కొరత ఏర్పడింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచింది. ఒక పక్క  క్రూడాయిల్ బ్యారెల్ ధర పెరిగి అన్ని చమురు ఉత్పత్తుల ధరలు పెరిగాయి.   పెట్రోలు, డీజిల్ ధరల  తాకిడి వలన ఆటోలు, టాక్సీలు, రవాణా వాహనాలన్నిటిపై  చార్జీలు పెంచేశారు.  అంతర్జాతీయ  విపణిలో బ్యారెల్ 120 డాలర్లు ఉంటే ఇరాన్  అధీనంలోని  హార్మూజ్  జలసంధి  మూసివేయడంతో అక్కడే  ఆగివున్న  నౌకలు  తిరుగుముఖం పట్టాయి.  ఇరాన్  చమురు  కేంద్రాలపై  ఇజ్రాయెల్  విరుచుకుపడడం వల్ల కూడా చమురు ధరలకు  రెక్కలొచ్చాయి.  తమపై దాడులు ఇలాగే కొనసాగితే  బ్యారెల్ చమురును 200 డాలర్లకు పెంచేస్తామని ఇరాన్​కు  చెందిన  ఇస్లామిక్  రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్  ఇప్పటికే  గల్ఫ్ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది.  కేవలం చమురు రంగమే కాదు చమురు వినియోగంపై ఆధారపడి ఉన్న అని పరిశ్రమలపై యుద్ధ ప్రభావం పడింది.

స్తంభించిన మానవ నిత్యావసరాలు

 వైరి యుద్ధాల పక్షాల  సవాళ్ల  పరిస్థితి ఏమోగానీ  ఇప్పటికీ  పశ్చిమాసియాలో చాలా ప్రాంతాల్లో  మానవ సమాజ నిత్యావసరాలు స్తంభించిపోయాయి.  భారత దేశ  వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మీద, సాధారణ గృహావసరాల మీద పెద్ద దెబ్బే పడింది.. అమెరికా దూరాలోచన లేని  దురాలోచన వల్ల యుద్ధ సన్నద్ధత  లేకుండానే ఇరాన్ మీద విరుచుకుపడిన ప్రయత్నం బెడిసికొట్టింది.  యుద్ధంలో విజేతలెవరు,   పరాజితులెవరో   తేలేముందే  సామాన్య  ప్రజానీకాన్ని  చావుదెబ్బ కొట్టారు.   వంటగ్యాస్   తయారీ  పరిశ్రమ  కుదేలవడంతో  గతంలో  సిలిండర్  బుకింగ్ వ్యవధి 21 రోజులుండగా తాజాగా 25 రోజులకి పెంచారు. 

వినియోగదారులపై భారం

వినియోగదారులు  ధరల భారం నుంచి  తప్పించుకోలేరు.  ఇప్పటికే  పప్పుదినుసులు,  నూనెగింజలు, వంట నూనెల ధరలు పెరిగాయి.  ఫిబ్రవరి 28న యుద్ధ ఛాయలు కమ్ముకోగానే ఇరాన్, హార్మూజ్​ల  బంధం  తెలిసిన  కార్పొరేట్ వ్యాపారులు వారి  ఆయిల్ తదితర  సరుకుల్లేవని బోర్డులు పెట్టేశారు.  నెల జీతాలు చేతికందేసరికి  నిత్యావసర వస్తువుల రేట్లు బాగా  పెరిగాయి. 'నో స్టాక్'  బోర్డులతో  కృత్రిమ  కొరత మార్కెట్లో తాండవిస్తోంది.  హోల్​సేల్  మార్కెట్లకు కూడా  ఎలాంటి 
మినహాయింపు లేదు.  ఎల్పీజీ  స్టాక్ లేక గ్యాస్ కంపెనీలు చేతులెత్తేసే  పరిస్థితి కనుచూపు మేరలో కనపడుతోంది.  ఇప్పటికే  ముంబయి,  బెంగళూరు, కోల్​కతా,   చెన్నై వంటి  ప్రధాన  నగరాల్లో  కమర్షియల్ ఎల్పీజీ  సిలిండర్ల  సరఫరా  నిలిచిపోయింది.  కొన్ని  హోటళ్లు   తినుబండారాలు ప్రస్తుత ధరలకు  
అందించలేక  మూతపడ్డాయి.  

 వేధిస్తున్న  గ్యాస్  కొరత

దేశంలోని  ముడిచమురు,  పెట్రోలియం,  ఉత్ప త్తులు ఆరువారాల వరకు వస్తాయని  కేంద్రమే ప్రకటించింది.  కేంద్రం వాణిజ్య సిలిండర్లపై తీసుకున్న నిర్ణయంతో  చిన్న,  మధ్య తరగతి రెస్టారెంట్లు, హోటళ్లు,  టిఫిన్ సెంటర్లకు గ్యాస్  కొరత ఏర్పడింది.  పెద్ద పెద్ద నగరాల్లో 25 శాతం హోటళ్లు మూసేసినట్టు అంచనా.    దేశంలో  రూ.6.6 లక్షల కోట్ల విలువైన హోటల్ పరిశ్రమపై,  వంట గ్యాస్ కొరత వలన పరోక్షంగా ఆ రంగానికి చెందిన ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని రెస్టారెంట్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

- సభావట్ కళ్యాణ్, 
 ఢిల్లీ యూనివర్సిటీ

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.