ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్..జాయింట్ చెక్ పవర్ ఉండటమే కారణం

ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్..జాయింట్ చెక్ పవర్ ఉండటమే కారణం
  •  
  • సర్పంచ్​ పోస్టుకు కోటా కలిసిరాని చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు
  • వార్డు మెంబర్​గా బరిలో నిలిచి.. ఎలాగైనా ఆ పదవి దక్కించుకోవాలని ప్లాన్లు
  • ఏకగ్రీవమైన వార్డుసభ్యులకు ముందస్తుగా నగదు ఆఫర్లు 
  • మేజర్​ పంచాయతీల్లో రూ.10 లక్షల వరకు ఖర్చు
  • ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్​ గ్రామాల్లో ప్యానల్ పాలిటిక్స్ 
  • జనరల్ సీట్లలోనూ ఇదే పరిస్థితి.. అయితే సర్పంచ్​ గిరి, లేకుంటే ఉప సర్పంచ్​ గిరి

హైదరాబాద్/ భూపాలపల్లి, వెలుగు: పంచాయతీ ఎన్నికల పోరులో రోజు రోజుకు సీన్ మారుతున్నది. సర్పంచ్ పదవే కాదు.. ఉప సర్పంచ్ పోస్టుకు కూడా ఇప్పుడు ఫుల్​ డిమాండ్​ నడుస్తున్నది.  సర్పంచ్ పదవి కోసం రిజర్వేషన్లు కలిసిరాని చోట ఆశావహులు వార్డు మెంబర్​గా పోటీ చేసి.. గెలిచి, ఉప సర్పంచ్​ పదవి దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. పంచాయతీ నిధులు, బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, సెక్రటరీతోపాటు ఉప సర్పంచ్‌‌కు కూడా ‘జాయింట్ చెక్ పవర్’ ఉండటంతో ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది.  మేజర్ పంచాయతీల్లో ఆశావహులు వార్డు సభ్యుడిగా గెలిచి ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. గతంలో పలుచోట్ల సర్పంచ్, ఉప సర్పంచ్​ మధ్య సమన్వయం లేకపోవడంతో గొడవలు జరిగాయి. ఒకానొక దశలో ఉప సర్పంచ్​లకు చెక్​ పవర్​ రద్దు చేయాలంటూ సర్పంచ్​లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు సర్పంచ్‌‌గా గెలిచిన తర్వాత చెక్ పవర్ విషయంలో ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. తమ మాట వినేవారినే వార్డు సభ్యులుగా గెలిపించుకునేందుకు సొంతంగా ‘ప్యానల్స్’ కడుతున్నారు.  వారి ఎన్నికల ఖర్చులూ భరించేందుకు ముందుకు వస్తున్నారు. తమ ప్యానల్ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తూ.. ఉప సర్పంచ్ పదవి కూడా తమ వర్గానికే దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు.

రిజర్వేషన్లు కలిసిరానిచోట

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్​ పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.  రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్ పదవికి రాజకీయ అనుభవం లేని కొత్తవారిని, డమ్మీ క్యాండెట్​ను బరిలో దింపుతున్నారు. పెత్తనం తమ చేతిలోనే ఉండాలంటే ఉప సర్పంచ్ పదవి కీలకమని భావించి.. వార్డు సభ్యులుగా పోటీ పడుతున్నారు. భూపాలపల్లి జయశంకర్​ జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గతంలో ఎస్టీ జనరల్ కాగా, ఇప్పుడు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది.  దీంతో ఇక్కడ ఉప సర్పంచ్ కోసం ఐదుగురు పోటీ పడుతున్నారు. కొత్తపల్లిగోరి మండలం చిన్నకోడేపాకలో సర్పంచ్​ పోస్టుకు ఎస్సీ మహిళ రిజర్వేషన్ ఉండటంతో ఉప సర్పంచ్ గా పదవి దక్కించుకోవాలనుకునేవాళ్లు ఏకంగా రూ.10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్నది. ఉప సర్పంచ్ ఎన్నికలో తనకు మద్దతిచ్చే వార్డు సభ్యులకు భారీ నజరానాలు ప్రకటిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట ఒక్కో వార్డు సభ్యుడికి రూ. లక్ష వరకు నగదు ఇస్తామంటూ ముందస్తుగానే డీల్స్ కుదుర్చుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లాలో గణపురం, చెల్పూర్, కాటారం, మహదేవపూర్, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లితోపాటు రాష్ట్రవ్యాప్తంగా మేజర్ గ్రామాల్లో ఉప సర్పంచ్​ పదవి కోసం బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక.. వార్డు మెంబర్లు అందరూ కలిసి ఉప సర్పంచ్​ను ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుండటంతో.. ఉప సర్పంచ్​ పదవిని  కైవసం చేసుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. జాయింట్​ చెక్​ పవర్​ ఉండటంతో శాసించవచ్చని, తమ పెత్తనం చూపెట్టొచ్చని పావులు కదుపుతున్నారు. 

జనరల్ స్థానాల్లోనూ తీవ్ర పోటీ 

రిజర్వేషన్ల పరంగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన చోట వెనుక ఉండి రాజకీయాలు నడపాలనుకునేవారు ఉప సర్పంచ్ పదవిపై కన్నేయగా..  జనరల్ స్థానాల్లో  మాత్రం ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది.  జనరల్ స్థానాల్లో సామాజికవర్గాల వారీగా రాజకీయంగా బలంగా ఉన్న నాయకులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా అధికారం చేజారిపోతుంది. అందుకే సర్పంచ్ అభ్యర్థులు తమకు నమ్మకస్తులైన వారిని వార్డుల్లో నిలబెట్టి ఉప సర్పంచ్​ చేయాలనుకుంటున్నారు. గెలిచే అవకాశమున్న వార్డు సభ్యులను ముందుగానే మచ్చిక చేసుకుంటున్నారు. అవసరమైతే ఫలితాల తర్వాత వారిని క్యాంపులకు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ సర్పంచ్ పదవి ప్రత్యర్థి వర్గానికి వెళ్లినా.. ఉప సర్పంచ్ పదవి తమ చేతిలో ఉంటే ‘చెక్ పవర్’ ద్వారా వారిని కంట్రోల్ చేయవచ్చనేది జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నవారు భావిస్తున్నారు. అందుకే పోటీ ఎక్కువగా ఉన్న జనరల్ స్థానాల్లో సర్పంచ్​గా అవకాశం రాకపోయినా.. వార్డుల్లో పోటీచేసి ఉప సర్పంచ్ పదవి కైవసం చేసుకోవాలనుకుంటున్నారు.  మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  మేజర్ గ్రామాల్లో ఈ తరహా పాలిటిక్స్ జోరందుకున్నాయి.