- నామినేషన్ వేసినవాళ్లలో పార్టీల ఆశావహులే ఎక్కువ
- ఈ రెండు పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ ఆశావహులు తక్కువే
- చాలా చోట్ల ఆ పార్టీకి సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి
- ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద ?
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో శనివారం నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తరఫున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
టికెట్ కన్ఫామ్ కాకపోయినా తమకే బీఫాం వస్తుందనే ఆశతో చాలా మంది ప్రధాన పార్టీల నుంచి నామినేషన్ వేశారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచేందుకు ఎక్కువ మంది పోటీపడగా.. ఈ సారి మాత్రం సీన్ రివర్సయింది.
బల్దియాల్లో అందిన నామినేషన్ల లెక్క ప్రకారం.. కొన్నిచోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీజేపీ పేరుతో ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల సంఖ్య విషయంలో చాలాచోట్ల బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంది. చాలా చోట్ల ఆ పార్టీకి సమర్థులైన అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది.
కరీంనగర్లో బీజేపీ టికెట్లకు డిమాండ్..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ టికెట్లకు తీవ్ర పోటీ ఉంది. ఈ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉండగా 374 నామినేషన్లు బీజేపీ పేరుతో దాఖలయ్యాయి. అంటే సగటున ఒక్కో డివిజన్ నుంచి ఐదుగురు బీజేపీ టికెట్ కోసం పోటీపడుతుండడం విశేషం. వీళ్లలోనూ చాలా మంది క్రియాశీలక నాయకులే ఉండడంతో ఒకరికి బీఫాం ఇచ్చి.. మిగతా వారిని బుజ్జగించడం ఆ పార్టీ రాష్ట్ర పెద్దలకు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇదే కార్పొరేషన్ లో కాంగ్రెస్ నుంచి 309 నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే ఒక్కో డివిజన్ నుంచి సగటున నలుగురైదుగురు పోటీపడుతున్నారు. ఆశావహులను పోటీ నుంచి తప్పించడం కాంగ్రెస్ పెద్దలకు పెద్ద టాస్క్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి ఒక్కో డివిజన్ లో ముగ్గురు, నలుగురు పోటీపడుతున్నారు.
మిగతా మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి..
జమ్మికుంటలో 30 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ తరఫున 80 నామినేషన్లు, బీజేపీ తరఫున 79 నామినేషన్లు, బీఆర్ఎస్ తరఫున 64 నామినేషన్లు దాఖలయ్యాయి. హుజూరాబాద్‌లో అత్యధికంగా కాంగ్రెస్ తరఫున 89, బీజేపీ తరఫున 79, బీఆర్ఎస్ నుంచి 77 నామినేషన్లు సమర్పించారు. చొప్పదండిలో మాత్రం బీఆర్ఎస్ తరఫున 34 నామినేషన్లు రాగా, బీజేపీ తరఫున 31, కాంగ్రెస్ తరఫున 27 నామినేషన్లు దాఖలయ్యాయి.
రెబల్స్ బెడద తప్పదా ?
ఒక్కో పార్టీ నుంచి ఐదారుగురు నామినేషన్లు వేయడాన్ని బట్టి చూస్తే చాలా చోట్ల రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తోంది. ఈ నెల 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో ఇప్పటి నుంచే టికెట్ ఇచ్చే అవకాశం లేని ఆశావహులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇందుకోసం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగుతున్నారు. నామినేటెడ్ పోస్టులు, కోఆప్షన్ మెంబర్ గా అవకాశమిస్తామని కాంగ్రెస్ నేతల తమ పార్టీ ఆశావహులకు హామీ ఇస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పార్టీ పదవుల్లో ప్రాధాన్యమిస్తామని చెప్తున్నారు.
