నో ఫికర్.. జనాల్లో తగ్గిన కరోనా భయం

నో ఫికర్.. జనాల్లో తగ్గిన కరోనా భయం
  • మాస్కులు లేవు.. సోషల్​ డిస్టెన్స్​ లేదు
  • పెరిగిన స్ట్రీట్‌‌ ఫుడ్‌‌, రెస్టారెంట్ల బిజినెస్‌‌
  • త్వరలో మల్టిప్లెక్స్‌‌లు, థియేటర్లు ఓపెన్‌‌
  • రోడ్లపై పెరిగిన రద్దీ.. ట్రాఫిక్‌‌ జామ్‌‌లు

హైదరాబాద్, వెలుగు: జనంలో కరోనా ఫికర్ తగ్గింది. మళ్లీ నార్మల్ లైఫ్ లోకి వస్తున్నరు. అన్ లాక్ మొదలైనప్పటి నుంచి కొనేటోళ్లు.. అమ్మేటోళ్లు.. చేసేటోళ్లు.. తినేటోళ్లు.. వచ్చేటోళ్లు.. పోయేటోళ్లతో అన్ని చోట్ల రద్దీ కనిపిస్తోంది. చాయ్ బండి నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు, షాప్స్ నుంచి మాల్స్ వరకు అన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. ముందు మాదిరే రోడ్లన్నీ వెహికల్స్‌‌‌‌తో నిండిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్​లు మళ్లీ మామూలైపోయాయి. మాల్స్, మార్కెట్లలో రష్ కనిపిస్తోంది. దాదాపు ఆర్నెల్ల తర్వాత రాష్ట్రం మునుపటిలా కనిపిస్తోంది. బ్యాక్ టు నార్మల్ లైఫ్ అంటూ జనం కూడా ముందుకు సాగిపోతున్నారు. ముఖానికి మాస్క్ లు, అక్కడక్కడ సోషల్ డిస్టెన్స్ మాత్రమే.. ఆరు నెలల కిందటికీ, ఇప్పటికీ ఉన్న తేడాలు. ఇక మిగతాదంతా సేమ్ టుసేమ్.

మాల్స్, రెస్టారెంట్లు కిటకిట

నాలుగు నెలల కిందటే రెస్టారెంట్లు ఓపెన్‌‌‌‌ చేసినా జనం చాలా తక్కువగానే వెళ్లేవాళ్లు. ఇప్పుడు రెస్టారెంట్లు, షాపింగ్‌‌‌‌ మాల్స్‌‌‌‌లో రద్దీ కనిపిస్తోంది. అన్‌‌‌‌ లాక్‌‌‌‌ తర్వాత వ్యాపారం పెరుగుతోందని మాల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. 6 నెలలు రెస్టారెంట్ ఫుడ్ మిస్సయిన జనాలు ఇప్పుడు హోటల్స్​కు క్యూ కడుతున్నారు. లిమిటెడ్ క్రౌడ్‌‌‌‌ని అనుమతిస్తుండటంతో చాలా హోటల్స్ లో కస్టమర్లు వెయిట్ కూడా చేస్తున్నారు. ఇక మాల్స్ కు వెళుతున్న వారిసంఖ్య వందల్లోనే ఉంటోంది. చాలా స్టోర్స్ ఆఫర్స్ పెట్టడంతో షాపింగ్​కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీకెండ్స్ లో క్రౌడ్ పెరుగుతుందని మాల్స్ మేనేజర్లు చెబుతున్నారు.

ఇటు ఫుడ్.. అటు వర్కౌట్స్

టిఫిన్ సెంటర్లు, చాయ్ బండ్లు, కేఫ్​లు రద్దీగా మారిపోయాయి. టిఫిన్ సెంటర్ల వద్ద ఉదయం, సాయంత్రం క్రౌడ్ కనిపిస్తోంది. ఇక పానీపూరి, ఫాస్ట్ ఫుడ్, చాట్ భండార్ల వద్ద యూత్ ఎక్కువగా కనిపిస్తున్నారు.ఫుడ్ ఆన్ వీల్స్, నైట్ ఫుడ్ స్టాల్స్ ఓపెన్ అవడంతో మిడ్ నైట్ లో టేస్టీ ఫుడ్ లాగించేస్తున్నారు. ‘‘మొదట్లో రోజుకి 50 మంది వచ్చేవారు. ఇప్పుడు 150 మందికిపైగా కస్టమర్లు వస్తున్నారు. లాక్ డౌన్ తో పోలిస్తే ఇప్పుడు వ్యాపారం బాగుంది” అని హైదరాబాద్ లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ మహేశ్ చెప్పారు. ఇక జిమ్ కి వెళ్లే వాళ్లంతా లాక్‌‌డౌన్ టైంలో ఆన్‌‌లైన్ లైవ్ సెషన్స్ ద్వారా ఇంట్లోనే వర్కౌట్స్ చేశారు. అన్ లాక్ లో జిమ్‌‌లు ఓపెన్ అయినా మొదట్లో వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత జిమ్ లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. లిమిటెడ్‌‌ క్రౌడ్‌‌కే అనుమతి ఇస్తుండటంతో జిమ్‌‌లకు వచ్చే వారే టైం సెట్‌‌ చేసుకుంటున్నారు. పార్క్‌‌లు ఓపెన్‌‌ చేయడంతో జాగింగ్‌‌, వాకింగ్‌‌ కోసం జనాలు ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నారు.

రైతు బజార్లకు భారీగానే..

రైతుబజార్లు, మార్కెట్లు కూడా రద్దీగానే ఉంటున్నాయి. లాక్‌‌డౌన్‌‌ సమయంలో వీధుల్లో ఏర్పాటు చేసిన ట్రాలీల వద్దే జనం కూరగాయలు కొనే వాళ్లు. ఇప్పుడు ఫ్రెష్‌‌ వెజిటబుల్స్‌‌ కోసం రైతు బజార్లకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు. నిత్యావసరాలను ఆన్‌‌లైన్‌‌ ఆర్డర్స్‌‌ ద్వారా తెప్పించుకున్న వాళ్లు కూడా ఇప్పుడు ఇళ్ల నుంచి బయటికి వస్తున్నారు. సూపర్‌‌ మార్కెట్లు, కిరాణా షాపులకు వెళ్లి సరుకులు కొని తెచ్చుకుంటున్నారు. సూపర్‌‌ మార్కెట్లు, కిరాణా షాపుల్లో కొంత మేరకు కరోనా రూల్స్ పాటిస్తున్నా రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో అలాంటి జాగ్రత్తలేవి కనిపించడం లేదు.

మళ్లీ ట్రాఫిక్‌‌ జామ్‌‌లు

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ షురూ అవడంతో జనాలు బస్సుల్లో, మెట్రోలో జర్నీలు మొదలుపెట్టారు. షేర్ ఆటోల్లోనూ ప్రయాణికులు కిక్కిరిసి కనిపిస్తున్నారు. మెట్రోలో వెయ్యి మంది వరకు ప్రయాణం చేసేందుకు అనుమతి ఉండేది. కరోనా కారణంగా ఆ సంఖ్యను 300లకు తగ్గించారు. లాక్ డౌన్ కంటే ముందు మెట్రోలో రోజుకి 4 లక్షల మంది జర్నీ చేయగా, ప్రస్తుతం 30 వేల నుంచి 35 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. అన్ని ఆఫీస్‌‌లు, వ్యాపార సంస్థలు ఓపెన్‌‌ చేయడంతో వాటిలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది డ్యూటీకి పరుగులు పెడుతున్నారు. రోడ్లపైకి వెహికల్స్‌‌ ఎక్కువగా వస్తుండటంతో లాక్‌‌డౌన్‌‌కు ముందు మాదిరి మళ్లీ ట్రాఫిక్‌‌ జామ్‌‌లు మొదలయ్యాయి. రీక్రియేషన్‌‌ సెంటర్లకు జనాల రాక పెరుగుతోంది.

ఫ్యామిలీతో బయటికి వచ్చాం

ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ గా పని చేస్తున్నా. మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు అంతా నార్మల్ అవడంతో కేబుల్ బ్రిడ్జి చూసేందుకు ఫ్యామిలీ అంతా బయటికి వచ్చాం. లంచ్ కూడా ప్లాన్ చేసుకున్నాం. ఆరునెలలు పిల్లలు ఇంటికే పరిమితం అయ్యారు. వాళ్లు కూడా డిస్ట్రబ్ అవుతున్నట్లు అనిపించింది. అందుకే వాళ్లకి రీఫ్రెష్ గా ఉంటుందని తీసుకొచ్చా. చాలా హ్యాపీగా ఉన్నారు. బయటికి వచ్చినప్పుడు మాస్క్, శానిటైజర్ తో పాటు మా వాటర్ మేమే క్యారీ చేస్తున్నాం.

– శివప్రసాద్, జూబ్లీహిల్స్, హైదరాబాద్

మళ్లీ ఒకప్పటిలా అనిపిస్తోంది

లాక్ డౌన్ ఎప్పటివరకు కంటిన్యూ అవుతుందో తెలియక 2 నెలలకు సరిపడా గ్రాసరీ కొన్నాం. తర్వాత కరోనా కేసుల భయంతో ఆన్‌‌లైన్ లో ఆర్డర్ చేసుకోవడం స్టార్ట్ చేశాం. ఇప్పుడు అందరు బయటకు వస్తున్నారు. మళ్లీ ఒకప్పటిలా అనిపిస్తోంది. అందుకే సూపర్ మార్కెట్‌‌కి వచ్చి సరుకులు తీసుకుని వెళ్తున్నాం.

– వనజ, మాదాపూర్, హైదరాబాద్

షాపింగ్ మిస్ అయ్యాం

లాక్ డౌన్ తో షాపింగ్ ని చాలా మిస్ అయ్యాం. అందుకే ఇప్పుడు వచ్చాం. ఆన్​లైన్ లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. కానీ డైరెక్ట్ గా చూసి కొంటేనే కదా సాటిసిఫాక్షన్ ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ కి వచ్చాను.

– రేష్మ, బంజారాహిల్స్, హైదరాబాద్