పోలింగ్ కేంద్రాల వద్ద లోకల్ పోలీసులు వద్దు.. సీఈసీ ప్రత్యేక ఆఫీసర్ల టీమ్​ వెల్లడి

పోలింగ్ కేంద్రాల వద్ద లోకల్ పోలీసులు వద్దు.. సీఈసీ ప్రత్యేక ఆఫీసర్ల టీమ్​ వెల్లడి

హైదరాబాద్, వెలుగు :  పోలింగ్ కేంద్రాల వద్ద లోకల్ పోలీసులు కాకుండా ఇతర ప్రాంతాల సిబ్బంది డ్యూటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ప్రత్యేకంగా నియమించిన ఆఫీసర్ల టీమ్ సూచించింది. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు చేయాల్సిన, చేయకూడని పనులతో రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారులు ఒక లిస్ట్ తయారు చేసి అందజేయాలని తెలిపింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలకు చెందిన రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారులతో సోమవారం సీఈవో వికాస్ రాజ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ టీమ్​ పాల్గొంది. ఏర్పాట్లపై సీఈవో ఇతర అధికారులు ఈ టీమ్​కు వివరించారు.

వీడియోలు తీయడంపై ట్రైనింగ్ ఇవ్వండి

తర్వాత టీమ్​లోని రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ వి.నాయక్, రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, ప్రత్యేక వ్యయ పరిశీలకుడు బాలకృష్ణన్ ఐఆర్ఎస్ (రిటైర్డ్) మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులందరూ కచ్చితంగా పాటించాల్సిన రూల్స్​ను వివరించారు. రాజకీయ కార్యక్రమాలను వీడియోలు తీయడంపై అన్ని వీడియో నిఘా బృందాలకు శిక్షణ ఇవ్వాలని, కచ్చితంగా కెమెరాలతోనే చిత్రీకరించాలని సూచించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి, పెండింగ్‌లో ఉన్న అన్ని 6వ నంబరు ఫామ్​లను నవంబర్ 10 లోగా పరిష్కరించాలని తెలిపారు. ప్రతి జిల్లాలో ఓటర్ల జాబితాపై వచ్చిన అన్ని కంప్లైంట్లను ఫిర్యాదుదారు ఫోన్ నంబర్ తో సహా నమోదు చేయాలని సూచించారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు తమ మొబైల్ ఫోన్‌లలో సీ-విజిల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనీ, సీ-విజిల్ యాప్‌ కు రాష్ట్ర స్థాయి పత్రికలలో ప్రకటనల ద్వారా ప్రచారం కల్పించాలని తెలిపారు.