కేసీఆర్ కుటుంబంపై సర్వత్రా వ్యతిరేకత ఉంది.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

కేసీఆర్ కుటుంబంపై సర్వత్రా వ్యతిరేకత ఉంది.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

వరంగల్ అర్బన్: ‘‘సీఎం కేసీఆర్ కుటుంబంపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది.. మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు..  అది బీజేపీతోనే సాధ్యం..’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్ హాల్ లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.  జిల్లా అధ్యక్షులు రావు పద్మా, అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి,  మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే లు ధర్మారావు, మందడి సత్యనారాయణ, వన్నాల శ్రీరాములు,  ఎండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈఎన్నికలు తెలంగాణకు చాలా కీలకం.. దుబ్బాకలో ప్రజలు టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టారు.. హైదరాబాద్ లో బీజేపీ సత్తా చాటింది..’’ అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 2016లో రైల్వే ఓవరాలింగ్ పరిశ్రమను కేంద్రం ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 160ఎకరాల భూమిని ఇవ్వకపోవడంతోనే ఆప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. అలాగే బీబీనగర్ లో మెడికల్ కాలేజీ ప్రారంభమైనా ప్రభుత్వం భూములను ఇవ్వలేదన్నారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 30కోట్ల రూపాయలు చెల్లించలేదన్నారు. 6వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమ తెచ్చాం.. దానిని త్వరలోనే ప్రధాని ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏజిల్లాలోనూ ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించలేదని, బీజేపీకి పేరు వస్తుందని ఆయుస్మాన్ భారత్ పథకాన్ని ఇన్నాళ్లూ అడ్డుకుందని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడిచిన టీఆర్ఎస్ నాయకుల మాటలు ఎవరూ నమ్మొద్దు అని ఆయన కోరారు. కేసీఆర్ కుర్చీవేసుకుని కూర్చొని వరంగల్ లో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మిస్తామన్నారు.. అవి ఎక్కడికి పోయాయి..? పేదలంటే కేసీఆర్ కు అంత చులకనా..? ఉద్యమకారులు రోడ్ల పై ఉంటే…. ఉద్యమ ద్రోహులు ప్రగతి భవన్ లో రాజ్యమేలుతున్నారని, ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకుని పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని, ప్రపంచంలో సచివాలయం లేని రాష్ట్రం మన బంగారు తెలంగాణనే అని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సొంత ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ప్రాంతాలకు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ఒక్క టీచర్ నియమాలు చేపట్టారా.. చెప్పాలని నిలదీశారు. నిరుద్యోగులు నియమకాలను చేపట్టాలని ఆందోళనలు చేస్తే బలవంతంగా అణిచి వేస్తున్నారని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ.. మోసాలు చేస్తున్న మాజీ రంజీ ప్లేయర్ అరెస్ట్

మళ్లీ మోగుతున్న వాట్సప్ ‘ప్రైవసీ’ గంటలు..

ప్రియుడితో పెళ్లికోసం చిన్నారిని ఎత్తుకెళ్లిన యువతి

ఏడాదికి 50 కిలోల ఫుడ్ పడేస్తున్నం