హెచ్​వోడీల మార్పు తప్పదా !.. కొత్త ప్రభుత్వంలో డిపార్ట్ మెంట్లకు కొత్త ఆఫీసర్లు

హెచ్​వోడీల మార్పు తప్పదా !.. కొత్త ప్రభుత్వంలో డిపార్ట్ మెంట్లకు కొత్త ఆఫీసర్లు
  • సీఎస్​గా శాంతి కుమారిని కొనసాగిస్తారని ప్రచారం
  • ఇన్నేళ్లు అప్రాధాన్య పోస్టుల్లో ఉన్నోళ్లకు ప్రయారిటీ దక్కే చాన్స్

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంలో సీఎంవోలో ఎవరుంటారు? వివిధ శాఖలకు హెచ్​వోడీలను ఉన్నోళ్లనే కొనసాగిస్తారా లేక కొత్తవాళ్లను నియమిస్తారా అనేదానిపై సెక్రటేరియెట్ వర్గాల్లో తీవ్రచర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రయారిటీలన్నీ మారుతాయని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వాళ్లందరిని పక్కన పెట్టనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నియమితులయ్యారు. ఇప్పుడు ఆమెను కొనసాగిస్తారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటికే శాంతి కుమారి కాంగ్రెస్ మేనిఫెస్టో, గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. రిటైర్​మెంట్​కు ఇంకో సంవత్సరం ఉంది. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈక్వెషన్లో భాగంగానే శాంతి కుమారికి సీఎస్ పదవి కట్టబెట్టినట్లు కాంగ్రెస్ భావిస్తున్నది. దీంతో ఆమెను కొనసాగిస్తారని అష్యూరెన్స్ వచ్చిందని సెక్రటేరియెట్ వర్గాలు అంటున్నాయి. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్ స్పెషల్ సీఎస్, హెచ్ఎండీఏ సెక్రటరీగా కొనసాగుతున్న అర్వింద్ కుమార్, ఐటీ, ఇండస్ర్టీస్ జయేశ్ రంజన్, సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, హౌసింగ్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, కమర్షియల్ టాక్స్ కమిషనర్​గా ఉన్న క్రిస్టీనా జడ్ చొంగ్తూ, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, టీఎస్​ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఐ అండ్ పీఆర్ స్పెషల్ సెక్రటరీ అశోక్ రెడ్డి వంటివారి శాఖలు మారే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఐఏఎస్​లు శైలజా రామయ్యర్, బుర్రా వెంకటేశం, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రాహుల్ బొజ్జా వంటి వారికి ముఖ్యమైన శాఖలు అప్పగించే చాన్స్ ఉన్నది. సీఎంవోలో తెలంగాణ ఐఏఎస్​లకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు చర్చ జరుగుతున్నది.

రీఅపాయింట్ చేసినోళ్లను కొనసాగిస్తారా?

రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల కాలంలో ఐదారుగురు ఐఏఎస్​లు రిటైర్డ్​ అయిన తరువాత  రీఅపాయింట్​మెంట్ అయ్యారు. వీరిని కొనసాగిస్తారా లేక వద్దని చెప్తారా అనేదానిపై స్పష్టత రాలేదు. అయితే రెండేండ్లపాటు కొనసాగేలా రీఅపాయింట్​మెంట్ ఇచ్చినందున కొనసాగించేందుకే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దీనిపై క్లారిటీ రానుంది. స్పెషల్ సీఎస్​ హోదాలో రిటైరయిన అధర్ సిన్హాను ప్రభుత్వం రెండేండ్ల పాటు పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్​గా కొనసాగిస్తూ రీఅపాయింట్ చేసింది. ఆ తరువాత జీఏడీలో ప్రొటోకాల్ సెక్రటరీగా ఉన్న అర్విందర్ సింగ్​ను కూడా రిటైర్ అయిన తరువాత మళ్లీ అదే పోస్టులో రెండేండ్ల పాటు నియమించింది. ఇక దేవాదాయ, సివిల్​ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్ కూడా రిటైర్ అయ్యాక.. తిరిగి ఆ శాఖలోనే అదే పోస్టులో ప్రభుత్వం పునర్నియమించింది. ఇటీవలే కార్మిక శాఖ స్పెషల్ సీఎస్​గా రిటైర్ అయిన రాణి కుముదినిని మళ్లీ అదే పోస్టులో తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 10 నెలల కిందట రిటైర్ అయిన ఒమర్ జలీల్ ను కూడా ప్రభుత్వ కార్యదర్శి, మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్​గా రీఅపాయింట్ చేసింది.