పాత నోటిఫికేషన్ల నియామకాలూ లేవు
డిసెంబర్ నుంచి ఇప్పటివరకు
పదివేల మందికిపైగా రిటైర్
ప్రతినెలా వందల సంఖ్యలో పదవీ విరమణ
సిబ్బంది లేక చాలా డిపార్ట్మెంట్లలో ఇబ్బందులు
ఖాళీల భర్తీని పట్టించుకోని సర్కారు
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ
గ్రూప్–1 నోటిఫికేషన్ ఇయ్యలే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏడాదిగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆగిపోయింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు ప్రతినెలా వందల మంది రిటైర్ అవుతున్నా కూడా కొత్తగా నియామకాలేవీ చేపట్టడం లేదు. గత ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ కోసం టీఎస్పీఎస్సీకి అప్పగించిన పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. అసలు రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు గ్రూప్–1 నోటిఫికేషనే విడుదల కాలేదు. రోస్టర్ సిస్టంను ఫైనల్ చేయకపోవడంతో కొన్ని పోస్టుల నియామకానికి బ్రేకులు పడ్డాయి. కొత్త జోన్లు, వాటి పరిధిలోని పోస్టులపై స్పష్టత రాకపోవడం వల్ల కూడా ఇబ్బంది నెలకొంది.
ఏడాదిలో పదివేల మంది రిటైర్
2018 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు పదివేల మంది ఉద్యోగులు రిటైర్ అయినట్టు అధికారులు చెప్తున్నారు. మండల కేంద్రం లెవల్ నుంచి సెక్రటేరియట్ వరకు వివిధ డిపార్ట్మెంట్లలో ప్రతి నెలా 500 మంది వరకు రిటైర్ అవుతున్నారు. గతంలో ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టుల వివరాలు తీసుకునే వారని, ఇప్పుడు తీసుకోవడం లేదని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
సరిపడా సిబ్బంది లేక కీలకమైన రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్లు చాలా ఇబ్బందిపడుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఐదువేల ఎకరాలకో అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఉన్నారని.. వారిపై అధిక పనిభారం ఉండటంతో అనుకున్న టైంలో ఫలితాలు రావడం లేదని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇరిగేషన్ శాఖలో సుమారు నాలుగు వేల మంది సిబ్బంది అవసరమని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని సీఎం కేసీఆర్ పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఆ శాఖలో ఉద్యోగాల భర్తీ అనుమానమేనని ఓ ఉన్నతాధికారి అన్నారు.
రాష్ట్రమొచ్చినప్పటి నుంచి గ్రూప్–1 లేదు
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కాలేదు. గత టెర్మ్ సమయంలో 128 గ్రూప్–1 ఖాళీలను గుర్తించి, భర్తీ కోసం టీఎస్పీఎస్సీకి అప్పగించారు. కానీ ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. దీనికి సర్కారు నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలున్నాయి. కొత్త జోన్ల ప్రకారం గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించిన సర్కారు.. ఏ పోస్టులు దేని పరిధిలోకి వస్తాయన్న విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీనిపై టీఎస్పీఎస్సీ ఇప్పటికే నాలుగైదు సార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన రాలేదని అంటున్నారు. ఇక గ్రూప్–3లో దాదాపు 306 ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలంటే కొత్త రోస్టర్ సిస్టం తయారు చేయాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని, టీఎస్పీఎస్సీ పలుమార్లు లెటర్లు రాసినా స్పందించలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి.
గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి
రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాలను ప్రారంభించినా వాటిల్లో సరిపడా ఉద్యోగులను నియమించలేదు. ఎన్నికల ముందు హడావుడిగా 268 బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారు. వాటిలో స్టాఫ్‌ను నియమించకపోవడంతో కాంట్రాక్టు టీచింగ్ స్టాఫ్‌తోనే క్లాసులు నడిపిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు సుమారు రెండు వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేయాలని బీసీ గురుకులాల అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఇంతవరకు సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలిసింది.
యూనివర్సిటీల్లో నియామకాల్లేవు
రాష్ట్రంలో పదకొండు యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 1,061 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు గత టెర్మ్‌లో అనుమతిచ్చారు. భర్తీ ప్రక్రియకు సంబంధించి కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైంది. ఆ కేసులు తేలాక రిక్రూట్ మెంట్ పని మొదలయ్యే టైంలో మళ్లీ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇప్పుడే నోటిఫికేషన్లు వద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడమే దీనికి కారణమని వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
