గూగుల్ పే, ఫోన్‌పేలాగానే పీఎఫ్ విత్‌డ్రా.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. వెంటనే ఈ పనులు చేయండి..

గూగుల్ పే, ఫోన్‌పేలాగానే పీఎఫ్ విత్‌డ్రా.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. వెంటనే ఈ  పనులు చేయండి..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలోనే ఒక కొత్త మార్పును తీసుకురాబోతోంది. ఇకపై ఉద్యోగులు  ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును డైరెక్ట్  UPI ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు.

EPFO  లేటెస్ట్ వెర్షన్ 3.0ను తీసుకువస్తుండటంతో, ఈ యూపీఐ విత్ డ్రా  ప్రక్రియ తుది దశకు చేరింది. దీనికి సంబంధించిన  టెస్టింగ్  కూడా పూర్తయ్యాయి. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే, కేవలం మీ యూపీఐ పిన్  ఎంటర్ చేయడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోకి పీఎఫ్ డబ్బును వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే రూ. 5 లక్షల వరకు ఉండే క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా సెటిల్ చేసేలా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే, ఈ కొత్త టెక్నాలజీ ద్వారా డబ్బులు వెంటనే అకౌంట్‌లోకి రావాలంటే మీ పీఎఫ్ రికార్డులు పక్కాగా ఉండాలి. పేరు, ఆధార్, బ్యాంక్ అకౌంట్  లేదా మొబైల్ నంబర్లో తప్పులు ఉంటే మీ క్లెయిమ్ ఆగిపోతుంది. అందుకే, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే ముందే ఉద్యోగులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన 5 విషయాలు  ఉన్నాయి:

1. మీ UAN నంబర్‌ 
మీ పీఎఫ్ అకౌంట్ కి సంబంధించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివ్‌గా ఉందో లేదో ముందే చూసుకోండి. UAN యాక్టివ్‌గా లేకపోతే మీరు ఎలాంటి ఆన్‌లైన్ సేవలు,  KYC అప్‌డేట్, డబ్బు విత్‌డ్రా  చేయలేరు. ఒకవేళ మీకు పాస్‌వర్డ్ గుర్తులేకపోయినా లేదా మొబైల్ నంబర్ మార్చిన.. చివరి వరకు ఆగకుండా వెంటనే EPFO మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి.

2. ఆధార్, పాన్ కార్డ్ వివరాలు 
మీ UAN నంబర్ ఖచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. మీ పీఎఫ్ రికార్డుల్లో ఉన్న పేరు, పుట్టిన తేదీ,  Gender వంటి వివరాలు మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగానే ఉండాలి. ఆధార్, పాన్ కార్డు, కంపెనీ రికార్డుల్లో పేర్లు లేదా తండ్రి పేరు తప్పుగా ఉంటే యూపీఐ ద్వారా జరిగే ఆన్‌లైన్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. అలాగే మీ పీఎఫ్ అకౌంట్ కి పాన్ కార్డ్  లింక్ అయి ఉండాలి. లేదంటే డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు  పన్ను కట్ అవుతుంది.

3. బ్యాంక్ అకౌంట్  వివరాలు 
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు నేరుగా మీ అకౌంట్‌లోకి వస్తాయి కాబట్టి, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్, మీ పేరు స్పష్టంగా ఉండాలి. మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్  ప్రస్తుతం రన్నింగ్‌లో ఉండాలి. వాడకుండా పక్కన పెట్టిన అకౌంట్, మీ పేరు సరిగ్గా లేని జాయింట్ అకౌంట్లు, లేదా పాత కంపెనీకి సంబంధించిన జీతం అకౌంట్  ఉంటే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ  UPI ID యాక్టివ్‌గా ఉందో లేదో, అది  బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

4. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ
యూపీఐ ద్వారా లావాదేవీలు జరిగేటప్పుడు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్, UAN నంబర్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్,  మీరు వాడుతున్న యూపీఐ మొబైల్ నంబర్.. ఈ మూడు ఒకటే అయి ఉండాలి. అప్పుడే ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా డబ్బులు జమ అవుతాయి.

5. సర్వీస్ హిస్టరీ, నామినేషన్  
మీరు గతంలో వేర్వేరు కంపెనీల్లో పనిచేసి ఉంటే, ఆ పాత పీఎఫ్ ఖాతాలన్నింటినీ మీ ప్రస్తుత UAN నంబర్‌తో విలీనం చేసుకోండి. పాత కంపెనీల యజమానులు మీ 'ఉద్యోగం లాస్ట్ తేదీని' పీఎఫ్ పోర్టల్‌లో అప్‌డేట్ చేశారో లేదో చూసుకోండి. దీనితో పాటు మీ పీఎఫ్ అకౌంట్‌కు ఇ-నామినేషన్ పూర్తి చేయండి. పెళ్లయిన వారు, లేదా కుటుంబ వివరాలు మార్చాలనుకునే వారు వెంటనే నామినీ పేరును అప్‌డేట్ చేయాలి. నామినేషన్ సరిగ్గా లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ ప్రాసెస్ చేయడం కష్టమవుతుంది.

ముఖ్యమైన  విషయం ఏంటంటే  యూపీఐ టెక్నాలజీ వల్ల డబ్బులు వెంటనే  అకౌంట్లోకి వస్తాయి.. కానీ రికార్డుల్లో ఉండే తప్పులను సాఫ్ట్‌వేర్ దానంతట అదే సరిదిద్దలేదు. కాబట్టి డబ్బు అవసరమయ్యే ముందే మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం ఈ యూపీఐ ఆధారిత పీఎఫ్ విత్ డ్రా సిస్టంని EPFO రెడీ చేస్తోంది. అధికారికంగా పూర్తిగా అందుబాటులోకి వచ్చే తేదీలు, నిబంధనలు మారే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు  అధికారిక epfindia.gov.in పోర్టల్‌ను సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.