ఈ లక్షణాలుంటే ప్రొటీన్​ తక్కువైనట్లే

ఈ లక్షణాలుంటే ప్రొటీన్​ తక్కువైనట్లే

శరీరానికి అవసరమైన అతిముఖ్యమైన పోషకం ప్రొటీన్​. అయితే కండరాల సైజ్​ పెరగడానికి మాత్రమే ప్రొటీన్​ పనికొస్తుంది అనుకుంటాం. కానీ జీవక్రియలు, రక్తంలో ఆక్సిజన్​ సరఫరా, అనారోగ్యం, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసే యాంటీ బాడీల ఉత్పత్తికి కూడా ప్రొటీన్లు చాలా అవసరం.  లైఫ్​ స్టైల్​, హెల్త్​ను బట్టి ప్రొటీన్ల అవసరం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ప్రొటీన్​ తగ్గినప్పుడు  కనిపించే లక్షణాలివి..

మూడ్​ మారుతుంది

ప్రొటీన్​ తక్కువైనప్పుడు మూడ్​ ఒకేలా ఉండదు. చిరాకు, అయోమయం, ఆలోచనా శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూడ్స్​కు కారణమయ్యే సెరటోనిన్​ వంటి  పలు రకాల హార్మోన్లు, న్యూరోట్రాన్స్​మీటర్ల తయారీలో ప్రొటీన్​ ఎంతో కీలకం. రోజులో శరీరానికి అందాల్సిన ప్రొటీన్​ అందకపోతే మూడ్​ స్వింగ్స్​ ఎక్కువవుతాయి.  

ఎముకల బలం

ఎముకలు దృఢంగా ఉండేందుకు క్యాల్షియం కావాలి. వాల్యూమ్​ పరంగా చూస్తే సగానికి పైగా బోన్స్​ ప్రొటీన్​తో తయరైనవే. బోన్స్​ స్ట్రాంగ్​గా, హెల్దీగా ఉండేందుకు విటమిన్​–డి, క్యాల్షియంతో పాటు డైటరీ ప్రొటీన్​ కూడా చాలా అవసరం. వయసు పై బడుతున్న కొద్దీ ఎముకల్లో లవణాలు తగ్గకుండా చూడడంలో ప్రొటీన్ల రోల్​  ఎంతో కీలకం.

తినాలనిపిస్తుంది

శరీరానికి రోజూ కొంత మోతాదులో కొన్ని  పోషకాలు అవసరం. ప్రొటీన్​ ఫుడ్​ తగినంత తిననప్పడు రక్తంలో చక్కెర తగ్గిపోతుంది. అప్పుడు ఏదైనా తినాలనే కోరిక పుడుతుంది. 

వీటికి మరీ అవసరం

చర్మం, వెంట్రుకలు, గోళ్లు పూర్తిగా ప్రొటీన్​తో తయారవుతాయి.  అందుకే, ప్రొటీన్​ తగ్గితే ఆ ప్రభావం వీటిపై పడుతుంది. ప్రొటీన్​ మరీ తక్కువైతే చర్మం ఎర్రబారి, పగుళ్లు కనిపిస్తాయి. స్కిన్​ రంగు మారుతుంది. వెంట్రుకలు సన్నగా అయి ఊడిపోతాయి. అలాగే గోళ్లు పెలుసుగా మారి విరిగిపోతాయి.

కండరాల కోసం...

  • సరైన ఫుడ్​ తింటూ, రెగ్యులర్​గా ఎక్సర్​సైజ్​ చేస్తున్నప్పటికీ ఫ్యాట్​ కరిగినట్టు అనిపించడం లేదా! అయితే, ప్రొటీన్​ సరిపోను తినడం లేదని అర్థం. చాలినంత ప్రొటీన్​ తినకపోతే శరీరం కండరాలను సరిగ్గా రిపేర్​ చేయలేదు. దాంతో ఫ్యాట్​ బర్న్​ చేయడం అటుంచి, కండలు కరిగిపోతాయి. అంతేకాకుండా డైలీ ఫుడ్​లో ప్రొటీన్​ తగ్గితే ఎనర్జీ లెవల్స్​ పడిపోతాయి. 
  • కిలో బరువుకు సుమారు1-1.5 గ్రాముల ప్రొటీన్​ అవసరం. అంటే, 60 కిలోల బరువు ఉన్నవాళ్లు రోజుకు 6‌‌0 నుంచి 90 గ్రాముల ప్రొటీన్​ తినాలి. మాంసం, గుడ్లు, చేపలు, పాల పదార్థాలు, సోయా, చిక్కుడు వంటివి తింటే ప్రొటీన్​ సరిపోను అందుతుంది. అయినా కూడా ప్రొటీన్​ చాలకపోతే వే ప్రొటీన్, వేగన్​ ప్రొటీన్​ పౌడర్​ వంటి సప్లిమెంట్లు తీసుకోవచ్చు. అయితే, న్యూట్రిషనిస్ట్​ల సలహా తీసుకున్నాకే వీటిని వాడాలనే విషయం గుర్తుంచుకోవాలి.