RTC సమ్మెపై ఈ మంత్రులు మాట్లాడరేంది..!

RTC సమ్మెపై ఈ మంత్రులు మాట్లాడరేంది..!

హరీశ్, కేటీఆర్, ఈటల, జగదీశ్, శ్రీనివాస్గౌడ్ యాడున్నరు?
తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచి.. ఇప్పుడు వదిలేస్తరా?
ఆర్టీసీ కార్మికుల ప్రశ్న

హైదరాబాద్, వెలుగుతెలంగాణ ఉద్యమంలో తమతో కదం కదం కలిపి ఇప్పుడు మంత్రులుగా ఉన్న హరీశ్​రావు, ఈటల రాజేందర్​, కేటీఆర్​, జగదీశ్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ తమ సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమంతో సంబంధం లేని కొందరు మంత్రులు ఇష్టమున్నట్లు మాట్లాడుతుంటే.. కార్మికుల గురించి, తెలంగాణ ఉద్యమ నేపథ్యం గురించి అన్నీ తెలిసిన ఆ ఐదుగురు మంత్రులు మౌనంగా ఉండటం ఏందని నిలదీస్తున్నారు. వీళ్లంతా నాడు తెలంగాణ ఉద్యమమప్పుడు సకల జనుల సమ్మెలో, వంటావార్పులో, డిపోల ముందు ఆందోళనల్లో తమతో కలిసి పాల్గొన్న నేతలేనని ఆర్టీసీ కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు. మన రాష్ట్రం మనకు వస్తే బాధలన్నీ తీరుతాయని అప్పట్లో నమ్మకం కల్పించిన ఈ నాయకులు.. ఇప్పుడు 12 రోజులుగా తాము ఆర్టీసీ రక్షణ కోసం సమ్మె చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ఆందోళన కార్యక్రమాల్లో వాళ్లు చర్చించుకుంటున్నారు. ‘‘హరీషన్న, రాజేందరన్న, రామన్న, జగదీశన్న, శీనన్న ఏడున్నరు మీరు? మా బాధల్ని ఎందుకు పట్టించుకుంటలేరు. మీరు మౌనంగా ఎందుకుంటున్నరు’’ అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ ఈ ఐదుగురు మంత్రులు ఏం చేస్తున్నట్లు?!

నియోజకవర్గంలో ఈటల

ఆర్టీసీ సమ్మె మొదలైన నాటి నుంచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ టు తన నియోజకవర్గం హుజూరాబాద్  పర్యటిస్తున్నారు తప్ప సమ్మె అంశంపై ఎక్కడా మాట్లాడటం లేదు. హైదరాబాద్ లో ఉంటే శాఖాపరమైన సమీక్షలకు హాజరవుతున్నారు. మంగళవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిర్వహించిన సమీక్ష సమావేశానికి వెళ్లారు. అక్కడ డిపార్ట్​మెంట్ విషయాలు తప్ప మరో విషయమే చర్చించలేదని తెలిసింది. తన వద్దకు వచ్చే నాయకులతో కూడా ఈటల ఇతర విషయాలపై మాట్లాడుతున్నారు కానీ సమ్మె అంశాన్ని ప్రస్తావించడంలేదని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే చెప్పారు. బుధవారం ఈటల తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్​లో పర్యటించారు.

హుజూర్ నగర్ దాటని జగదీశ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక షెడ్యూల్​ విడుదలైనప్పటి నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి అదే నియోజకవర్గంలో ఉంటున్నారు. కేటీఆర్ రోడ్డు షోలు రద్దు కావడంతో ఆయన ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ప్రగతిభవన్ నుంచి వచ్చే డైరక్షన్స్ మేరకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అంతే తప్ప ఎక్కడ కూడా ఆర్టీసీ సమ్మె విషయంపై ఆయన మాట్లాడం లేదు.

టూరిజం రివ్యూలో శ్రీనివాస్ గౌడ్

సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటక శాఖ సమీక్షలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్  వారం రోజులుగా బిజీగా ఉన్నారు. జోగులాంబా దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడం, రవీంద్రభారతిలో జరిగిన దక్షిణ కొరియా కల్చరల్ డే, యాదాద్రి సమీపంలో నిర్మిస్తోన్న బస్వాపూర్ రిజర్వాయర్  పర్యాటక కేంద్రం అభివృద్ధిపై ఆయన సమీక్షలు జరిపారు.

ఆర్థిక శాఖ పనిలో హరీశ్

ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీశ్​రావు వారం రోజులుగా ఆ శాఖలో పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో రోజుకు రెండు ప్రభుత్వ శాఖల చొప్పున సమీక్షలు చేస్తున్నారు. ఒక్కోరోజు పొద్దుపోయేదాకా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిశాఖ మంత్రిని, ఆ శాఖకు చెందిన కీలక అధికారులను పిలిచి ఆర్థిక అంశాలు, పెండింగ్ బిల్లులపై ఆరా తీస్తున్నారు. ఒక్కో శాఖలో ఏ ఏ పథకాలు ఉన్నాయి? ఏ ఏ పథకానికి కేంద్రం ఇస్తున్న గ్రాంట్ ఎంత? రాష్ట్రం కేటాయిస్తున్న నిధులు ఎన్ని? తదితర లెక్కలు తీస్తున్నారు. సమీక్షలు చేస్తున్నట్టు మీడియాకు కూడా చెప్పొద్దని ఆయన కండీషన్ పెట్టినట్టు ఓ అధికారి తెలిపారు. రివ్యూలు లేని సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని కార్యక్రమాలకు హరీశ్​ హాజరువుతున్నారు. అక్కడ కూడా ఆర్టీసీ సమ్మెపై ఆయన మాట్లాడం లేదని స్థానిక నాయకులు అంటున్నారు.

మున్సిపల్ రివ్యూల్లో కేటీఆర్

ప్రతి చిన్న విషయంపై వెంటనే ట్విట్టర్ వేదికగా స్పందించే టీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్ ఇన్నిరోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారనే చర్చ టీఆర్​ఎస్  వర్గాల్లోనూ జరుగుతోంది. అయితే ఆయన వరుసగా బీఆర్కే  భవన్​కు వస్తూ మున్సిపల్ శాఖపై సమీక్షలు చేస్తున్నారు. అక్కడి నుంచే మున్సిపాల్టీల్లోని సమస్యల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సోమవారం బీఆర్కే భవన్​లో పట్టణ పారిశుధ్యంపై కేటీఆర్ నేతృత్వంలోని మంత్రుల సబ్ కమిటీ సమావేశం జరిగింది. అందులోనూ సమ్మె అంశం ప్రస్తావనకు రానట్టు తెలిసింది. బీఆర్కే భవన్​లోకి మీడియాపై ఉన్న ఆంక్షల విషయాన్ని మీడియా ప్రతినిధులు కేటీఆర్  దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. దూరం నుంచే ఆయన ‘మీ సమస్య ఏంటో తెలుసు. మళ్లీ కలుద్దాం’ అంటూ కారెక్కి వెళ్లిపోయారు.