దేవాదుల పైపుల్ని పట్టించుకుంటలే

దేవాదుల పైపుల్ని పట్టించుకుంటలే
  • ఆరు నెలల కిందట తేలిన పైప్‌లైన్లు
  • ఇప్పటికీ రిపేర్లు చేయించని సర్కారు
  • లక్షా 72 వేల ఎకరాల్లో యాసంగి సాగుపై ఎఫెక్ట్
  • ఆందోళనలో రైతులు

జయశంకర్‌ ‌భూపాలపల్లి, వెలుగు: 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. పైపుల రిపేర్లను పట్టించుకోవడం లేదు. నిరుడు జులై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు మూడు చోట్ల పైకితేలి, దెబ్బతిన్న పైప్‌‌లైన్లను ఇప్పటికీ రిపేర్ చేయలేదు. దీంతో లక్షా 72 వేల ఎకరాల్లో యాసంగి సాగుపై ఎఫెక్ట్ పడనుంది. ఈ నేపథ్యంలో వరి నాట్లు వేసిన వేలాది మంది రైతులు.. పంటకు నీళ్లు అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

దేవాదుల లిఫ్ట్ స్కీం కింద జయశంకర్ భూపాలపల్లి, జనగామ, హనుమకొండ, వరంగల్, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. కానీ రిజర్వాయర్లు, పైప్‌‌‌‌లైన్, కెనాల్, డిస్ట్రిబ్యూటరీ పనులు పెండింగ్‌‌‌‌లో ఉండడంతో లక్ష్యం మేర ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. దీంతో ఈ యాసంగిలో కేవలం 9 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో 1.72 లక్షల ఆయకట్టుకు సాగునీరిస్తామని ఆఫీసర్లు చెప్పారు. కానీ సీజన్​ ప్రారంభమై నెల గడుస్తున్నా ఇప్పటికీ చుక్క నీరు కూడా ఇవ్వలేదు. సర్కారు, ఇరిగేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. కిందటేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు దేవాదుల స్కీం ఫేజ్‌‌‌‌‌‌‌‌‒1, ఫేజ్‌‌‌‌‌‌‌‌2 కింద వేసిన పైప్‌‌‌‌‌‌‌‌లైన్లు మూడు చోట్ల దెబ్బతిని భూమి పైకి తేలాయి. దీంతో వానాకాలంలో కూడా ఆఫీసర్లు దేవాదుల మోటార్లను ఆన్‌‌‌‌‌‌‌‌చేయలేదు. దేవాదులతో నింపాల్సిన 524 చెరువులు, రిజర్వాయర్లు వర్షాలకే నిండడంతో వాటికింద రైతులు వానకాలం వరిసాగు చేశారు. ఈసారి పైప్‌‌‌‌లైన్లు రిపేర్​చేసి, సాగునీరు ఇస్తారనే ఆశతో యాసంగిలో రైతులు నాట్లు వేసుకున్నారు. నెల గడిచిపోతున్నా ఇప్పటికీ పైపులైన్లు రిపేర్లు చేయకపోవడంతో తమ పంటల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

నీళ్లు లిఫ్ట్‌‌‌‌ ‌‌‌‌చేయడం కష్టమే

దేవాదుల స్కీం ఫేజ్‌‌‌‌‌‌‌‌‒1 కింద కన్నాయిగూడెం మండలంలోని గోదావరి నది ఇన్​టెక్​వెల్ నుంచి  భీంఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, పులుకుర్తి, ధర్మసాగర్‌‌‌‌ ‌‌‌‌మీదుగా ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌ ‌‌‌‌వరకు, ఫేజ్‌‌‌‌‌‌‌‌‒2 కింద ఇన్​టెక్​వెల్ నుంచి  భీంఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, చలివాగు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌, ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌ వరకు పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ పనులు చేశారు. ఫేజ్‌‌‌‌‌‌‌‌‒2 కిందే ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, అశ్వరావుపల్లి, చీటకో డూర్‌‌‌‌‌‌‌‌ వరకు ఒక పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌, ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌ నుంచి గండి రామారం, బొమ్మకూర్‌‌‌‌‌‌‌‌, వెల్దండ, తపాస్‌‌‌‌‌‌‌‌పల్లి వరకు మరో పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ నిర్మించారు. మొదటి, రెండో దశల్లో కలిపి యేటా 4 మోటార్ల ద్వారా 12.33 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చు. కానీ కిందటేడాది భారీ వర్షాలకు పైప్‌‌‌‌‌‌‌‌లైన్లు‌‌‌‌ దెబ్బతిని భూమిపైకి తేలాయి. 6 నెలలుగా సర్కారు వీటి రిపేర్లను పట్టించుకోలేదు. ఇటీవలే రూ.2.5 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం ధర్మసాగర్‌‌‌‌, గండి రామారం మధ్య పైపులైన్​ రిపేర్ పనులు జరుగుతున్నాయి. ఇంకా రెండు చోట్ల పను లే మొదలుకాలేదు. దీంతో ఈ ఏడాది ధర్మసాగర్‌‌‌‌ ‌‌‌‌రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ వరకు నీళ్లు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌చేయడం కష్టమేనని ఆఫీసర్లు అంటున్నారు. 

మిషన్ భగీరథకూ కష్టాలు

పైప్‌‌‌‌లైన్లకు రిపేర్లు చేయకపోతే మిషన్‌‌‌‌ ‌‌‌‌భగీరథ స్కీమ్​కు ఇబ్బందులు తప్పడం లేదు. మున్ముందు వరంగల్, హనుమకొండ, కాజీపేటకు తాగునీటి సమస్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పైప్‌‌‌‌లైన్లు రిపేర్ చేయాలె

నాకు ఊరిలో5 ఎకరాల భూమి ఉంది. దేవాదుల నీళ్లు వస్తాయనే ఆశతో 4ఎకరాల్లో వరి వేశాను.  ధర్మసాగర్ మండలంలో దేవాదుల పైపులైన్ దెబ్బతిన్నదని, అందుకే నీళ్లు వస్తలేవని ఆఫీసర్లు చెప్తున్నారు. వెంటనే పైపులైన్లకు రిపేరు చేసి మాకు సాగునీరు ఇయ్యాలి. 

- గుగులోతు ఉమ్లా నాయక్, రైతు, ఫతేపూర్

ఫిబ్రవరిలోగా లిఫ్ట్‌‌‌‌ ‌‌‌‌చేస్తం

దేవాదుల స్కీం కింద మూడు చోట్ల పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ దెబ్బతిన్న మాట వాస్తవమే. రిపేర్ల కోసం రూ.2.5 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో దెబ్బతిన్న పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ రిపేర్లు చేసి,  ఫిబ్రవరిలోగా ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ వరకు గోదావరి నీళ్లు లిఫ్ట్‌‌‌‌ ‌‌‌‌చేస్తం.

- శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, చీఫ్‌‌‌‌ ‌‌‌‌ఇంజినీర్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌