ఇంజనీరింగ్ విద్యార్థి హత్య.. 24 గంటల్లోపే మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్టు

ఇంజనీరింగ్ విద్యార్థి హత్య.. 24 గంటల్లోపే మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్టు

మిట్ట మధ్యాహ్నం వేళ.. విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు, అతడి ఫ్రెండ్స్. కారులో వస్తున్న ఆ యువకుడిని ఐదారుగురు కలిసి అడ్డగించి.. గుండెల్లో కత్తితో పొడిచి చంపారు. ఈ ఘోరం అపార్ట్‌మెంట్ సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో పోలీసులు ఆ దుండగుల్ని సులభంగా గుర్తించగలిగారు. 24 గంటలు గడిచే లోపే ప్రధాన నిందితుడైన మాజీ ఎమ్మెల్యే కొడుకుని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన జరిగింది.

జూనియర్‌తో గొడవ.. చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ హత్య

యూపీలోని వారణాసికి చెందిన ప్రశాంత్ సింగ్ (23) అనే యువకుడు లక్నోలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. బుధవారం నాడు తన ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేట్ చేస్తుండగా… జూనియర్ ఒకడితో అతడికి చిన్న గొడవ జరిగింది. పరస్పరం తిట్టుకుంటూ ఒకరినొకరు తోసుకునే వరకూ వెళ్లింది. ఫ్రెండ్స్ కలగజేసుకోవడంతో కొట్లాట ఆగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు ప్రశాంత్. గురువారం మధ్యాహ్నం తన ఫ్రెండ్స్‌తో కలిసి గోమతి నగర్‌లోని విలాసవంతమైన అలకనంద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని తన సోదరి ఇంటికి ఇన్నోవా కారులో బయలుదేరాడు. అపార్ట్‌మెంట్ ఎంట్రెన్స్‌లోకి వెళ్లగానే ఐదారుగురు కలిసి బైక్‌లపై ప్రశాంత్ కారును అడ్డుకున్నాడు. అతడు అక్కడికి వస్తాడని తెలిసే పక్కా స్కెచ్‌తో వచ్చిన ఆ బ్యాచ్.. కారులో ఉన్న ప్రశాంత్ స్నేహితులపై దాడి చేసి అక్కడి నుంచి తరిమేశారు. ఆ తర్వాత కారు ముందు సీటులో ఉన్న ప్రశాంత్‌పై ఆ బ్యాచ్‌లోని ఒకడు కత్తితో దాడి చేశాడు. గుండెల్లో పొడవడంతో సాయం కోసం ప్రశాంత్ కారులో నుంచి దిగి.. అపార్ట్‌మెంట్‌లోకి పరిగెత్తాడు. కానీ, మెట్ల దగ్గరకి వెళ్లగానే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు.

సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో అరెస్టు

ఈ హత్యోదంతం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రశాంత్‌పై కత్తితో దాడి చేస్తున్న సమయంలో ఆ దుండగుల్లో మిగిలిన వాళ్లంతా చుట్టూ చేరి విజిల్స్ వేస్తూ.. చప్పట్లు కొట్టినట్లు ఆ విజువల్స్‌లో కనిపించింది. అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి ప్రశాంత్ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేసుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి… దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా విజువల్స్‌ ఆధారంగా హత్య చేసింది బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే షంషేర్ బహదూర్ కొడుకు అమన్ బహదూర్ అని గుర్తించారు. 24 గంటలు గడిచే లోపే శుక్రవారం ఉదయం అతడిని అరెస్టు చేశారు పోలీసులు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ప్రశాంత్ స్నేహితులను ఎంక్వైరీ చేసిన పోలీసులు.. జూనియర్‌తో జరిగిన గొడవ గురించి తెలుసుకున్నారు. ఈ హత్య అతడే చేయించి ఉంటాడని అనుమానిస్తున్నారు.

They cheered, clapped: Lucknow student’s murder caught on camera, son of ex-MLA arrested

హత్య కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు