హైదరాబాద్ సిటీ చందానగర్ లో బంగారం షోరూం దోపిడీకి యత్నం : పట్టపగలు తుపాకులతో బీభత్సం

హైదరాబాద్ సిటీ చందానగర్ లో బంగారం షోరూం దోపిడీకి యత్నం : పట్టపగలు తుపాకులతో బీభత్సం

హైదరాబాద్ సిటీ షాక్ అయ్యింది. పట్టపగలు.. నిత్యం రద్దీగా ఉండే చందానగర్ ఏరియాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. చందానగర్ మెయిన్ రోడ్డుపై ఉండే ఖజానా జ్యువెలర్స్ బంగారం షోరూంలో దోపిడీకి ప్లాన్ చేశారు దొంగలు. 2025, ఆగస్ట్ 12వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో.. ఖజానా జ్యువెలర్స్ షాపు ఓపెన్ చేసిన వెంటనే.. ఆరుగురు దోపిడీ దొంగలు తుపాకులతో షోరూంలోకి ఎంట్రీ ఇచ్చారు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్స్, సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీలోని చందానగర్ మెయిన్ రోడ్డుపై ఖజానా జ్యువెలర్స్ బంగారం షోరూం ఉంటుంది. ఈ షోరూంలోకి ఆరుగురు సభ్యుల ముఠా వచ్చింది. ముఖానికి మాస్కులు పెట్టుకున్నారు. వాళ్ల చేతుల్లో తుపాకులు ఉన్నాయి. షోరూంలోకి వచ్చీరాగానే.. బంగారం భద్రపరిచే లాకర్ కీ ఇవ్వాలంటూ బెదిరించారు. విషయం అర్థం అయిన వెంటనే సెక్యూరిటీ గార్డ్స్, షోరూంలోని సిబ్బంది అడ్డుకున్నారు. లాకర్ కీ ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. లాకర్ కీ ఇవ్వకపోవటంతో.. షోరూం అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపారు. తూటా గాయానికి అతను తీవ్రంగా గాయపడ్డాడు. షోరూంలో డిస్ ప్లే అద్దాలను ధ్వంసం చేశారు దొంగలు.

Also Read:-హైదరాబాద్ బంజారాహిల్స్లో హైటెన్షన్.. బంజారాహిల్స్‌కు వెళ్లే అన్ని మార్గాలు మూసివేత

షోరూంకి దోపిడీ దొంగలు వచ్చారన్న సమాచారం పోలీసులు ఫోన్ ద్వారా చెప్పారు సెక్యూరిటీ సిబ్బంది. ఆ వెంటనే పోలీసులు వాహనాలు ఖాజానా షోరూంకు వచ్చాయి. పోలీసులు వస్తున్నారన్న సమాచారం రావటంతో.. అక్కడి నుంచి పారిపోయారు ఆ ఆరుగురు దోపిడీ దొంగలు. 

షోరూంకు వచ్చిన పోలీసులు స్పాట్ మొత్తాన్ని పరిశీలించారు. వెంటనే దోపిడీ దొంగలను పట్టుకునేందుకు 10 టీమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులను అలెర్ట్ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. దోపిడీకి వచ్చిన దొంగలు రాష్ట్రానికి చెందిన వాళ్లా లేక అంతరాష్ట్ర ముఠానా అనే విషయాన్ని తేల్చేందుకు.. షోరూంలో వేలి ముద్రలు, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.

పట్టపగలు.. ఉదయం 11 గంటల సమయంలో రద్దీగా ఉండే ఏరియాలోని బంగారం షోరూంను.. దోపిడీ దొంగలు టార్గెట్ చేసి మరీ ఎటాక్ చేయటం అనేది సంచలనంగా మారింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.