
హైదరాబాద్: బంజారాహిల్స్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో వివాదస్పదంగా మారిన పెద్దమ్మ తల్లి ఆలయంలో మంగళవారం (ఆగస్ట్ 12) హిందూ సంఘాలు కుంకుమార్చాన పూజకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పెద్దమ్మగుడిలో అధికారుల కూల్చివేతలకు నిరసనగా హిందు సంఘాలు కుంకుమార్చన పూజకు పిలుపునిచ్చాయి. హిందు సంఘాల పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్దమ్మగుడి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్లే మార్గాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని.. అటు వైపు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. మరోవైపు నగర వ్యాప్తంగా బీజేపీ లీడర్లు, హిందు సంఘాల లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో ఓయూ పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తుండటంతో బంజారాహిల్స్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.