ఘరానా దొంగ దొరికాడు

ఘరానా దొంగ దొరికాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుతిరుగుతున్న ఘరానా దొంగను మలక్ పేట పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మలక్ పేట పీఎస్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జాయిట్ సీపీ, ఈస్ట్ జోన్ ఇన్ చార్జి డీసీపీ ఎం.రమేశ్​ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఏపీలో ని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన దాసర ముఖేశ్ అలియాస్ శ్రీను (38) బైక్ మెకానిక్ గా పనిచేసేవాడు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు భార్య చనిపోవడంతో మద్యం తాగడం, జల్సాలకు అలవాటుపడిన ముఖేశ్ 2012 నుంచి​ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఏపీలోని తిరుపతి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, నెల్లూరు, గుంటూరు, విజయవాడలో దాదాపు 30 ఇండ్లల్లో చోరీలు చేశాడు. 2012లో తిరుపతి, 2017లో గుంటూరు పోలీసులకు పట్టుబడి జైలుకు వెల్లి బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా ముఖేశ్​ అదే తరహాలో దొంగతనాలు చేసేవాడు. 2017 తర్వాత కొన్ని రోజులు ఒంగోలు జిల్లా చీరాల పట్టణంలోని శాంతి థియేటర్ సమీపంలో ఉన్న ముఖేశ్​2018 నుంచి హైదరాబాద్ కు వచ్చి వెళ్తూ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. సిటికి వచ్చి ముఖేశ్ ఉదయం వేళల్లో రహదారికి దగ్గరగా ఉన్న కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించేవాడు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించి రాత్రి వేళ్లలో తాళాలు పగులగొట్టి ఇండ్లలోకి వెళ్లి దొంగతనాలు చేసేవాడు. ఇందుకోసం ముఖేశ్​ఓ ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్, చిన్న టార్చ్ లైట్ వాడేవాడు. ఈ 3 వస్తువులు కాళ్లకు కట్టుకుని టార్గెట్ చేసుకున్న ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసేవాడు. దోచుకున్న సొత్తును తాకట్టు పెట్టడం, అమ్మడం చేయకుండా తన దగ్గరే ఉంచుకునేవాడు. డబ్బును మాత్రమే ఖర్చు చేసేవాడు. సిటీలో చోరీ చేసిన తర్వాత వెంటనే రహదారిపైకి వచ్చి ఏసీ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేవాడని పోలీసులు తెలిపారు.

ఇలా చిక్కాడు..

మలక్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని మూసారంబాగ్ లో ఉండే బాదే సురేశ్​(71) ఈ ఏడాది ఏప్రిల్ 7న తన కుటుంబంతో షిర్డీకి వెళ్లి ఏప్రిల్ 9న ఉదయం 10.30గంటలకు ఇంటికి వచ్చాడు.  తలుపు తీసి లోపల చూసేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంటి వెనుక తలుపు పగులగొట్టి ఉండటంతో బాధితుడు సురేశ్​ మలక్ పేట పోలీసులకు కంప్లయింట్ చేశాడు. తమ ఇంట్లోని 30 తులాల బంగారు ఆభరణాలు. రూ.16లక్షలు డబ్బు పోయినట్టు బాధితుడు తన కంప్లయింట్ లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మలక్ పేట పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారాంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేశారు. కానీ నిందితుడు సీసీ కెమెరాలకు చిక్కుండా మొహనికి మాస్క్, చేతులకు గ్లవ్స్ వాడుతూ జాగ్రత్తపడినట్టు గుర్తించారు. అయితే చోరీ చేసిన వ్యక్తి నడుస్తున్న తీరు, కదలికలను గుర్తించి అన్ని పోలీసు విభాగాల సిబ్బందికి వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేశారు. మరోవైపు మలక్ పేట ఏసీపీ సుదర్శన్ ఆదేశాల మేరకు మలక్ పేట ఇన్ స్పెక్టర్ సుబ్బారావు, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నాను నాయక్ స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.  చాదర్ ఘాట్ లోని మూసా నగర్ లో మూడురోజుల క్రితం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడం గమనించిన కానిస్టేబుల్ అశోక్ అతడిని అదుపులోకి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి విచారించారు. పట్టుబడ్డ వ్యక్తి ఘరానా దొంగ ముఖేశ్ గా పోలీసులు గుర్తించారు. మూసారాం బాగ్ లో ఏప్రిల్ 7న చోరీ చేసింది తానేనని ముఖేశ్ విచారణలో ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని మలక్ పేట, చిలకలగూడ పీఎస్ పరిధిలో, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురిలో మొత్తం 10 ఇండ్లల్లో ముఖేశ్ దొంగతనాలు చేసినట్టు పోలీసులు చెప్పారు. ముఖేశ్​పై 12 కేసులు నమోదు చేసి అతడి దగ్గరి నుంచి 65 తులాల బంగారం, రూ.2లక్షల43వేల డబ్బు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామన్నారు. ఈ కేసును చేధించిన పోలీసు అధికారులు, కానిస్టేబుల్ అశోక్, సిబ్బందికి జాయింట్ సీపీ రమేశ్ రెడ్డి చేతుల మీదుగా రివార్డులు అందించారు. మీడియా సమావేశంలో అడిషనల్ డీసీపీ గోవింద్ రెడ్డి, మలక్ పేట ఏసీపీ సుదర్శన్, సీఐ సుబ్బారావు, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నాను నాయక్, ఎస్సైలు శ్రీనివాస్ నాయక్, ఏడుకొండలు పాల్గొన్నారు.