వజ్రాల గని వల్ల రెండు లక్షల చెట్లకు ముప్పు

వజ్రాల గని వల్ల రెండు లక్షల చెట్లకు ముప్పు
  • గని పనులు ఆపాలంటూ సుప్రీంలో పిల్
  • ఉపాధి కోల్పోతామంటున్న గిరిజనులు
  • ప్రాజెక్టుకు వ్యతిరేకంగా క్యాంపైన్ చేస్తున్న పర్యావరణ ప్రేమికులు

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలోని బక్స్‌వాహా అడవులలో ఉన్న వజ్రాల గని పనులను ఆపాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ప్రాజెక్టును పర్యావరణవేత్తలు మరియు ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశలోని అతిపెద్ద వజ్రాల నిల్వ బక్స్‌వాహా అడవులలో ఉందని నమ్మకం. ఈ ప్రాంతంలో 3.42 కోట్ల క్యారెట్ల వజ్రాలు ఉన్నాయని అంచనా. ఈ ప్రాజెక్ట్ బక్స్‌వాహా అడవులలో 364 హెక్టార్లలో విస్తరించి ఉంది. అ ప్రాజెక్ట్‌లో భాగంగా వజ్రాలను వెలికితీస్తే 2,15,875 చెట్లు నరికివేయబడతాయి. అందుకే ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఈ ప్రాజెక్టు పనులను ఒక సంస్థ ప్రారంభించినప్పుడు కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. దాంతో వారు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయలేక తిరిగి వెళ్ళిపోయారు. తాజాగా.. ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు ఈశాన్యంగా 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న బక్స్‌వాహా అడవుల్లో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఆ పనులను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

అడవిలో చెట్లను నరికివేయడాన్ని వ్యతిరేకిస్తున్న పర్యావరణ కార్యకర్త రణవీర్ పటేరియా మాట్లాడుతూ.. ‘చాలా గిరిజన కుటుంబాలు ఈ అడవికి దగ్గరగా నివసిస్తున్నాయి. వారందరి జీవనోపాధి ఈ అడవిపైనే ఆధారపడి ఉంటుంది. గిరిజనులు వివిధ అటవీ ఉత్పత్తులను తయారుచేసి విక్రయించి.. ఆ డబ్బుతోనే జీవిస్తారు. ఈ ప్రాజెక్ట్ వారి జీవనోపాధిని దెబ్బతీయడమే కాకుండా.. తమ జీవితాలను కూడా నాశనం చేస్తుందని వారంతా భయపడుతున్నారు’అని ఆయన అన్నారు.

మరో పర్యావరణ ఔత్సాహికుడు అమిత్ భట్నాగర్ మాట్లాడుతూ.. అడవిని నరికివేయడం వల్ల సహజ ఆక్సిజన్ తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న సంస్థ స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెబుతుంది. మనం బతకడమే కష్టమైనప్పుడు.. ఉపాధి ఎవరికి కల్పిస్తారు? చెట్లను కాపాడటానికి మేం సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నాం’ అని ఆయన అన్నారు.