‘‘మాగ్నస్ ఒక గ్రేట్ హెల్పర్. మహారాజంటే మాగ్నసే. నా మనసు కరిగిపోయింది మాగ్నస్. డాడీకి చేసే పనిలో నువ్వు చాలా బాగా హెల్ప్ చేశావ్. నీలాంటోడు ఇంటికి ఒక్కడు ఉంటే చాలు’... ఇవి ఒక వీడియో కింద నెటిజన్స్ చేసిన కామెంట్స్. ఇవన్నీ చదువుతుంటే... ‘‘ఎవరబ్బా ఈ మాగ్నస్ తెగ పొగిడేస్తున్నారు. ఇంతకీ అతనేం చేశాడు?” అంటే... మాగ్నస్ అంటే మనిషి కాదు. అది ఒక కుక్క. సాధారణంగా పెంపుడు కుక్క తమ యజమాని ఏం చెప్తే అది చేస్తుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. పరుగెత్తమంటే పరుగెత్తుతుంది. ఈ పనులన్నీ పెంపుడు కుక్కలు చేస్తుంటాయి. అయితే, ఈ వీడియోలో ఉన్న కుక్క ఏం చేసిందంటారా... ఒకరోజు మాగ్నస్ యజమాని వాళ్ల గార్డెన్లో మొక్కలు నాటాలనుకున్నాడు. అందుకోసం షాప్‌కి వెళ్లి మొక్కలు కొని, తీసుకొచ్చి నాటాలి. ఆ పనంతా ఒక్కరే చేయడం కష్టం కదా. ఎవరో ఒకరి హెల్ప్ కావాలి. మరి ఆ పెద్దాయన ఇంట్లో సాయం చేసేందుకు ఎవరూ లేరో లేక మాగ్నస్ చాలు అనుకున్నాడో తెలియదు. మాగ్నస్‌ని వెంటబెట్టుకుని షాప్‌కి వెళ్లి, పూల కుండీలు కొన్నాడు. ఇంటికొచ్చి గార్డెన్లో పని మొదలుపెట్టాడు. అప్పుడు మాగ్నస్ తన యజమానికి కావాల్సిన వస్తువులు నోటితో పట్టుకొచ్చి ఇవ్వడం, మట్టి వేయడం, నీళ్లు పోయడం ఇలా అన్ని పనులు చేసింది. ఇదంతా వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టాడు. అది పెట్టిన కాసేపటికే వైరల్ అయ్యి, పైన చెప్పినట్లు కామెంట్ల వర్షం కురిసింది.
