
- = ఏపీలో ఎత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- = రాష్ట్రంలోనూ ఎత్తేస్తారని అప్పట్లో ప్రచారం
- = ఎలాంటి సవరణలు చేయని ప్రభుత్వం
- = పాత రూల్స్ ప్రకారమే ఎన్నికలకు..!
హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. మూడు విడుతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనుంది. అదే విధంగా రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సంతానం లిమిట్ ఎత్తేశారా..? లేదా..? అన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతానం లిమిట్ ఎత్తివేశారు. 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
తర్వాత పలు మార్పులు జరిగాయి. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని టచ్ చేయలేదు. పాత పద్ధతికే రైట్ చెప్పింది. ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. గతేడాది డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రి వర్గం ఆమోదించలేదు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు అనర్హులని తేల్చింది. ఇటీవలి కాలంలో దక్షిణాదిలో జనాభా తగ్గిపోతోందని, ఈ క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు తగ్గే చాన్స్ ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలను కనాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీలోని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు. దీంతో తెలంగాణలో సవరిస్తారని చర్చ జరిగింది. ఇటీవల పంచాయతీరాజ్ చట్టంలోని రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సెక్షన్ 21(3)ని సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లల నిబంధన యథాతథంగా ఉండనుంది. ఈ క్రమంలో పాత నిబంధనల ప్రకారమే సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.