మూడు సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: మహ్మద్ షమి

మూడు సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: మహ్మద్ షమి

రోహిత్ తో ఇన్ స్టా లైవ్ సెషన్ లో వెల్లడి

న్యూఢిల్లీ: గత కొన్నేళ్లలో మూడు క్రికెట్ ఫార్మాట్ లలో టీమిండియా పేస్ దళానికి మహ్మద్ షమి కీలక బౌలర్ గా మారాడు. అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం షమి వ్యక్తిగత జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో రీసెంట్ గా జరిగిన ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో షమి తన జీవితంలోని చీకటి క్షణాల గురించి చెప్పాడు.

2015 వరల్డ్ కప్ లో అయిన ఇంజ్యురీ నుంచి పూర్తిగా కోలుకోవడానికి తనకు 18 నెలలు పట్టిందని షమి పేర్కొన్నాడు. తన జీవితంలో అది చాలా బాధాకారమైన సమయం అని.. చాలా ఒత్తిడితో కూడుకున్న కాలం అని చెప్పాడు. ‘వరల్డ్ కప్ లో అయిన ఇంజ్యురీ నుంచి కోలుకొని ఆడటం మొదలుపెట్టాక.. నేను కొన్ని వ్యక్తిగత సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ నా కుటుంబం నాకు అండగా ఉండకపోతే ఆ ఇష్యూస్ ను అధిగమించేవాణ్ని కాదు. మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. ఆ టైమ్ లో మా ఫ్యామిలీలోని ఎవరో ఒకరు నాతో 24 గంటలూ ఉండేవారు. అప్పుడు నేను మానసికంగా బాగోలేను. కుటుంబం మద్దతుగా ఉండకపోతే ఏదైనా బ్యాడ్ డెసిషన్ తీసుకునే వాణ్ని. ఆ కఠిన సమయంలో నాతో ఉన్నందుకు నా ఫ్యామిలీకి కృతజ్ఞతలు’ అని షమి చెప్పాడు.