150 కి.మీ. స్పీడ్ తో నిద్రపోనిచ్చేవాడు కాదు

150 కి.మీ. స్పీడ్ తో నిద్రపోనిచ్చేవాడు కాదు

బ్రెట్ లీ టఫెస్ట్ బౌలర్ అని చెప్పిన హిట్ మ్యాన్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టర్ బ్రెట్ లీ వేసే పిడుగుల్లాంటి బాల్స్ ను ఎలా ఎదుర్కోవాలనే ఆలోచన తనకు నిద్రను దూరం చేసిందని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అన్నాడు. తాను ఫేస్ చేసిన కఠినమైన పేస్ బౌలర్ల గురించి రోహిత్ చెప్పాడు. ‘రిటైరైన క్రికెటర్లలో నాకు ఇద్దరు ఫేవరెట్ బౌలర్లు ఉన్నారు. ఒకరు బ్రెట్ లీ మరొకరు డేల్ స్టెయిన్. టఫెస్ట్ బౌలర్లలో బ్రెట్ లీ ఒకడు. అతడు నన్ను పడుకోనిచ్చే వాడు కాదు. 2007లో నా ఫస్ట్ ఆస్ట్రేలియా టూర్ లో 150 కి.మీ. పేస్ తో బౌలింగ్ చేసే బ్రెట్ లీని ఎలా ఎదుర్కోవాలా అని తెగ ఆలోచించేవాడ్ని. ఆ టైమ్ లో బ్రెట్ లీ తన కెరీర్ లోనే అద్భుతమైన దశలో ఉన్నాడు. నేను అతడ్ని దగ్గరి నుంచి గమనించా. బ్రెట్ నిలకడగా 150–155 కి.మీ. స్పీడ్ తో బౌలింగ్ చేసేవాడు. ఆ సమయంలో నాలాంటి యంగ్ స్టర్ అంత స్పీడ్ ను ఫేస్ చేయడమనే విషయం పడుకోనివ్వకుండా చేసేది. అలాగే డేల్ స్టెయిన్ ను ఎదుర్కోవాలని కూడా నేనెప్పుడూ కోరుకోను. పేస్, స్వింగ్ తో కూడిన అతడి బౌలింగ్ ను ఎదుర్కోవడమనేది పీడకల లాంటిది’ అని రోహిత్ పేర్కొన్నాడు.

ప్రెజెంట్ హేజల్ వుడ్ డేంజర్
ప్రస్తుత టైమ్ లో టెస్ట్ క్రికెట్ లో కంగారూ పేసర్ జోష్ హేజల్ వుడ్ ను తాను ఎదుర్కోవాలని అనుకోవడం లేదని రోహిత్ తెలిపాడు. హేజల్ వుడ్ క్రమ శిక్షణతో బౌలింగ్ చేస్తాడని, ఒకే లెంగ్త్ లో బౌలింగ్ చేస్తాడన్నాడు. బ్యాట్స్ మన్ కు జోష్ లూజ్ బాల్స్ అస్సలు వేయడన్నాడు. ఈ ఏడాది ఆఖరులో కంగారూ గడ్డపై జరిగే టెస్టు సిరీస్ లో హేజల్ వుడ్ ను ఎదుర్కోవడానికి తాను మానసికంగా ప్రిపేర్ అవ్వాలన్నాడు.