
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆది మానవుల ఆనవాళ్లు దొరికాయి. జగన్నాథపురం నుంచి అన్నపురెడ్డిపల్లి వెళ్లే దారిలో ఉన్న ‘అక్షరలొద్ది ఒంటిగుండు’పై చరిత్రకారులు రాతి చిత్రాలను గుర్తించారు. తేలు, ఎముకలు, ఉడుము, బల్లి, పురుగులు, నీళ్లలో బతికే జీవులు, మనుషుల పుట్టుక గురించి బొమ్మలు ఉన్నాయని పరిశోధకులు గోపి, కట్టా శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో పలుచోట్ల ఇలాంటి చిత్రాలు కనిపించినా, వీటికీ వాటికి చాలా తేడాలున్నాయని తెలిపారు. గుట్ట చివరన డాల్మన్, మెన్‌హిర్, సిస్ట్ సమాధులను పోలిన నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు ఆరాధన నిలిపేసిన ఆలయం ఆనవాళ్లు దొరికినట్లు వివరించారు. ఇక్కడ గుడి నిర్మాణం కోసం చెక్కిన ఘనాకారపు రాళ్లు, తల వరకూ స్పష్టంగా చెక్కిన ఆరున్నర అడుగుల రాతి శిల్పం దొరికింది. తల భాగంలో కళ్లు, చెవులు, నోరు, ముక్కు, బుగ్గలు స్పష్టంగా చెక్కి ఉన్నాయి. ముక్కు మాత్రం కొట్టేసినట్లు ఉందని వివరించారు. మెడ ఉన్నప్పటికీ మొండెం, చేతులు, కాళ్లు అస్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన రీసెర్చ్ చేయాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తరఫు కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కోరారు.