స్కూల్​ పునాదిలో 2 వేలకుపైగా బాంబులు.. ఒక్కటి పేలినా విధ్వంసమే

స్కూల్​ పునాదిలో 2 వేలకుపైగా బాంబులు.. ఒక్కటి పేలినా విధ్వంసమే

స్కూల్​ బేస్​మెంట్లో 2 వేలకుపైగా బాంబులు దొరికిన ఉదంతం కంబోడియాలోని ఓ స్కూల్​ విద్యార్థులను భయాందోళనకు గురి చేసింది. కంబోడియా ఈశాన్య ప్రాంతంలోని క్రాంటీ ప్రావిన్స్​లో ఓ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. 

వెపన్స్, మందుపాతరలు, రాకెట్ లాంచర్లన్నీ కలిపి సుమారు 2 వేలకు పైగా దొరికాయి. స్కూల్​కి కొత్త బిల్డింగ్​ కట్టాలని అధికారులు నిర్ణయించి పాత బిల్డింగ్​ని కూల్చడం ప్రారంభించారు. పునాదులను తవ్వుతుండగా ఇవి బయటపడగా, మరిన్ని ప్రాంతాల్లో తవ్వి అన్నింటినీ బయటకు తీశారు. 

గతంలో అంతర్యుద్ధం జరిగిన సమయంలో వీటిని సైనికులు పాతిపెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ సమయంలో బడిని ఆయుధ కేంద్రంగా ఉపయోగించారని స్థానికులు చెబుతున్నారు. వీటిని ఏదైనా వస్తువు బలంగా తాకితే పేలిపోయే ప్రమాదం ఉందని, ముందుగానే వీటి జాడ గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పిందని అంటున్నారు. 

కంబోడియా 1970 ల్లో జరిగిన అంతర్యుద్ధంలో ఆకలి, అనారోగ్యాల కారణంగా 17 లక్షల మంది పౌరుల్ని కోల్పోయింది. మందుపాతరలకు 64 వేల మంది మరణించగా, సుమారు 40 వేల మంది కాళ్లు, చేతులు పోగొట్టుకున్నారు.